తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక కీలక బిల్లుకు ఆమోదం కల్పించింది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులకు షాకిచ్చేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఇలా తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో 15 శాతాన్ని లేదా రూ.10 వేలు ఏది తక్కువ అయితే అది కోత విధించి.. ఆ మొత్తాన్ని నేరుగా వారి తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేసేలా 'తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు- 2026'ను తీసుకురాగా ఇటీవలో ఆ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కల్పించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ చట్టం ఆమోదం సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. తల్లిదండ్రుల తల్లిదండ్రుల బాగోగులు చూడలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ మాజీ మంత్రి.. తన భార్యకు భయపడి.. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన కన్న తండ్రి బాగోగులు చూడకుండా వదిలేశారని ఆరోపించారు. కనీసం ఆ తండ్రికి పండ్లు కూడా కొనివ్వలేదని పేర్కొన్నారు. దీంతో ఆయనే స్వయంగా వెళ్లి పండ్లు కొనుక్కున్నారని.. ఆ సమయంలో తనకు కనిపించినట్లు చెప్పారు. ఇక క్యాన్సర్ బాధితుడైన వృద్ధుడు ఇటీవలె చనిపోయారని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు వెళ్లి ఆ మాజీ మంత్రిని పరామర్శించి వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అందుకే ఈ కొత్త చట్టంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు ప్రజా ప్రతినిధులను కూడా చేర్చినట్లు స్పష్టం చేశారు. కనీసం ఆ మాజీ మంత్రి ఇంట్లో కన్న తండ్రికి అన్నం కూడా పెట్టలేదని ఆరోపించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రి యోగక్షేమాలు కూడా తెలుసుకునే పరిస్థితి కూడా ఆ మాజీ మంత్రికి లేదని మండిపడ్డారు. ఆ మాజీ మంత్రి తన తండ్రి పట్ల వ్యవహరించిన తీరు ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే వాళ్లు కూడా తల్లిదండ్రులను చూసుకునే బాధ్యతను నిర్వర్తించడం లేదని సంచలన ఆరోపణలు చేశారు.