ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఇన్వెస్టర్లకు నిమిషాల్లో రూ. 13 లక్షల కోట్లు లాభం!

Wait 5 sec.

Iran Israel War: హమ్మయ్యా.. వరుస నష్టాల నుంచి భారత సూచీలు ఎట్టకేలకు బుధవారం సెషన్‌లో (ఏప్రిల్ 1) పుంజుకున్నాయి. మార్చి నెలలో విపరీతంగా సూచీలు పడిపోయిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో .. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ ఒకటే 9 వేల పాయింట్లకుపైగా పడిపోయింది. ఇది సుమారు 11 శాతానికి సమానం. దీంతో మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ నెలలోనే రూ. 51 లక్షల కోట్లు పడిపోయింది. అయితే ఇప్పుడు ఏప్రిల్ 1న సూచీలు భారీగా పుంజుకున్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్ ఏకంగా 2 వేల పాయింట్లకుపైగా పెరగ్గా.. ఇన్వెస్టర్ల సంపద రూ. 13 లక్షల కోట్ల మేర పెరిగింది. >> కిందటి సెషన్‌లో సెన్సెక్స్ 71,947.55 వద్ద ముగియగా.. బుధవారం సెషన్‌లో నేరుగా 1800 పాయింట్లకుపైగా లాభంలో ప్రారంభమైంది. అక్కడితో ఆగకుండా ఇంకా పుంజుకొని ఇంట్రాడేలో నిమిషాల వ్యవధిలోనే 2 వేల పాయింట్లకుపైగా పెరిగి 73,964.58 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. ఇది దాదాపు 2020 పాయింట్ల వరకు పెరిగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 13 లక్షల కోట్లకుపైగా పెరిగి రూ. 425 లక్షల కోట్ల మార్కు దాటింది. కిందటి సెషన్‌లో ఇది రూ. 412 లక్షల కోట్లుగానే ఉంది. దాదాపు అన్ని స్టాక్స్ భారీగా పుంజుకున్నాయి. బీఎస్ఈ షేర్ ధర 7 శాతం వరకు పుంజుకుంది. ఐనాక్స్ ఇండియా 5 శాతం పెరిగింది. రిలయన్స్, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్ 2 శాతం వరకు పెరిగాయి. డీమార్ట్, ఇండిగో షేర్లు అయితే 8 శాతానికిపైగా పుంజుకోవడం విశేషం. చాలా రోజుల తర్వాత టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా ఇలా అన్ని ఐటీ స్టాక్స్ కూడా 2 శాతానికిపైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రంప్ ప్రకటనతోనే..ఇక్కడ బుధవారం రోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగేందుకు ప్రధాన కారణం.. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ముగింపుపై సంకేతాలు రావడమే. రానున్న 2-3 వారాల్లోనే యుద్ధాన్ని ముగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇటీవల భారీగా పెరిగిన క్రూడాయిల్ ధర 10 శాతం వరకు తగ్గి 105 డాలర్ల దిగువకు చేరింది. కిందటి రోజు ఇది 115 డాలర్లపైన ఉండేది. ఇది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెం‌ట్‌ను బలపరిచింది. మళ్లీ ఇటీవల వరుస పతనం నేపథ్యంలో కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్లు పెరుగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపరులు కూడా పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పలు గ్లోబల్ మార్కెట్లు కూడా పుంజుకోవడం కలిసొచ్చింది.