IOCL XP100 Price: అంతర్జాతీయంగా రాజకీయ- భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం దేశీయంగా కనిపిస్తోంది. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం నేపథ్యంలో.. కొంత కాలంగా చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొరతను అధిగమించేందుకు.. ఇంకా పెరిగిన ధరల భారాన్ని తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు ధరల్ని క్రమంగా పెంచేస్తున్నాయి. గత నెలలో వంట గ్యాస్ ధరలు సహా ప్రీమియం పెట్రోల్ ధరల్ని చమురు సంస్థలు పెంచేశాయి. ఇప్పుడు . ఇప్పుడు మరోసారి ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు సహా.. జెట్ ఫ్యూయెల్ ధరల్ని పెంచేశాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక ప్రకటన చేసింది. ఇక్కడ ప్రీమియం పెట్రోల్‌ను XP100 గా పేర్కొంటారు. దీని ధర లీటరుకు అంతకుముందు ఢిల్లీలో రూ. 149 గా ఉండగా.. భారీగా పెరిగి రూ. 160 కి చేరింది. ఇక ఎక్స్‌ట్రా గ్రీన్ ప్రీమియం డీజిల్ ధర అంతకుముందు లీటరుపై రూ. 91.49 గా ఉండగా.. ఇప్పుడు రూ. 92.99 కి చేరింది. XP-100 అనేది 100 ఆక్టేన్ పెట్రోల్. ఇది హై ఎండ్ కార్లు, సూపర్‌బైక్స్‌కు ఎక్కువగా వినియోగిస్తుంటారు. బెటర్ ఇంజిన్ పెర్ఫామెన్స్‌ కోసం ఇలా ప్రీమియం పెట్రోల్, డీజిల్ వాడుతుంటారు. యుద్ధం కారణంగా.. .. ఇండస్ట్రియల్ డీజిల్ ధరల్ని పెంచేశాయి. అప్పుడు లీటరుకు రూ. 2.09 నుంచి రూ. 2.35 వరకు పెరిగాయి. ప్రాంతాల్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు మరింత భారీగా పెంచడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 95.70 పలుకుతోంది. ఇటీవల ఈ పెట్రోల్, డీజిల్ ధరల్ని కూడా కేంద్రం ప్రతి 15 రోజులకు ఓసారి సమీక్షిస్తుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఏటీఎఫ్ ధర భారీగా పెంపు..ఇదే సమయంలో ఇప్పుడు విమానయాన సంస్థలపైనా అదనపు భారం పడనుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 8.5 శాతం మేర పెరిగి కిలో లీటరుకు రూ. 1,04,927 కు చేరింది. ముందటి రోజు ఇది రూ. 96,638.14 గానే ఉండేది. వాస్తవానికి ఈ ధర ఇవాళ ఏప్రిల్ 1న 115 శాతం పెరిగి రూ. 2 లక్షలపైకి చేరినా.. దేశీయ విమానయాన సంస్థలకు ఊరట కల్పిస్తూ ఈ పెంపును 8.5 శాతానికే పరిమితం చేసింది కేంద్రం. అంతర్జాతీయ విమాన సర్వీసులకు మాత్రం ఏటీఎఫ్ ధర ఎక్కువగానే పెరిగిందన్నమాట. ఏటీఎఫ్ ధరలు పెరగడంతో.. ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ టికెట్ ధరల్ని పెంచే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.