కాంగ్రెస్ నేత, .. తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలని సంతకాల సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి భారీగా మద్దతు లభిస్తుండటం విశేషం. ఏకంగా 52 మంది ఎమ్మెల్యేలు.. అనిరుధ్ రెడ్డి చేస్తున్న డిమాండ్‌కు మద్దతుగా సంతకాలు చేయడం గమనార్హం. ఇప్ప పువ్వు ఉత్పత్తులను ప్రోత్సహించాలని పేర్కొంటున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. ఇటీవల ఈ క్రమంలోనే ఇప్ప పువ్వు చెట్ల ఉద్యమాన్ని చెపట్టారు. రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లను నాటేలా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ డిమాండ్‌కు ఇప్పటివరకు వివిధ పార్టీలకు చెందిన 52 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.సీఎం రేవంత్ రెడ్డికి అనిరుధ్ రెడ్డి రాసిన లేఖలో.. తెలంగాణలో పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాల కోసం భారీ మొత్తంలో ఇప్ప చెట్లను నాటాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో లక్షలాదిగా ఇప్ప చెట్లను నాటేందుకు.. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. కరువును తట్టుకుని సైతం ఇప్ప చెట్లు పెరుగుతాయని.. తెలంగాణ లాంటి అర్ధ శుష్క ప్రాంతాలు ఈ ఇప్ప చెట్ల పెంపకానికి ఎంతో అనుకూలమైనవని స్పష్టం చేశారు. ఈ ఇప్ప చెట్లు నేలను సారవంతంగా మార్చడమే కాకుండా.. భూక్షయాన్ని కూడా అరికట్టి పచ్చదనాన్ని పెంచుతాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఇప్ప పువ్వులు, గింజలు ఆదాయానికి మంచి వనరులుగా ఉంటాయని.. గిరిజనులు, గ్రామాల్లో నివసించే ప్రజలు ఈ ఇప్ప ఉత్పత్తులను ఆహారం, ఔషధాలు, జీవనోపాధి కోసం ఉపయోగిస్తారని తెలిపారు. సమృద్ధిగా పోషకాలు ఉండి, ఔషధ గుణాలు కలిగిన ఈ ఇప్ప పువ్వులు.. స్థానిక ఆరోగ్య సంరక్షణకు ఎంతో మేలు చేస్తాయని.. అందుకే ఈ ఇప్ప చెట్లను భారీగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే మీడియా సమావేశాలు, అసెంబ్లీలో ఈ ఇప్ప పువ్వు, ఉత్పత్తులకు సంబంధించి.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు.