ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుని.. నూరేళ్ల పాటు హ్యాపీగా జీవితాన్ని కొనసాగించాలని భావించిన చాలా జంటలు.. పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు పడటం, విడిపోవడం, విడాకులు తీసుకోవడం, హత్యలు, ఆత్మహత్యలు ఇలా ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అప్పటివరకు ఇష్టంగా, ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్న వారు కూడా పెళ్లి తర్వాత తమ మనసులు, అభిప్రాయాలు మార్చుకుని.. ఎంత ప్రేమించారో అంతకంటే ఎక్కువగా ద్వేషించుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌ నగరంలో జరిగిన ఓ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫేస్‌బుక్‌లో అయిన పరిచయం.. ఆ ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ప్రేమికులను చేసింది. 5 ఏళ్లు ప్రేమించుకున్న తర్వాత రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన 50 రోజుల్లోనే యువతి సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఇషిక యాదవ్‌ అనే యువతి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. 5 ఏళ్ల క్రితం ఆమె బిహార్‌లో ఉండగా.. ఫేస్‌బుక్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్‌ బన్సాల్‌ అనే వ్యక్తితో పరిచయం అయింది. నీరజ్‌ బన్సాల్ కూడా హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ అయిన ఇషిక యాదవ్, నీరజ్ బన్సాల్.. ఆ తర్వాత ప్రేమికులుగా మారిపోయారు. చూస్తుండగానే 5 ఏళ్లు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ తమ ప్రేమ విషయాన్ని వాళ్ల ఇళ్లల్లో చెప్పి.. కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో ఇషిక యాదవ్, నీరజ్ బన్సాల్‌ల వివాహం జరిగింది.ఇక పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్‌‌కు వచ్చేసి ఉద్యోగం చేస్తున్న ఇషిక యాదవ్.. తన భర్త నీరజ్ బన్సాల్‌తో కలిసి హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. అయితే వీరికి పెళ్లే సరిగ్గా 50 రోజులు పూర్తి కాగా.. బుధవారం రోజున ఇషిక యాదవ్.. తమ ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర సంచలనం రేపుతోంది. ఆఫీస్‌‌కు వెళ్లి ఇంటికొచ్చిన భర్త నీరజ్ బన్సాల్.. ఇషిక యాదవ్‌ ఉరి వేసుకోవడం చూసి హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించాడు. అయితే అప్పటికే ఇషిక యాదవ్ చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇషిక యాదవ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ విషయాన్ని ఇషిక యాదవ్ కుటుంబ సభ్యులకు పోలీసులు తెలిపారు. అయితే అదనపు కట్నం కోసం భర్త నీరజ్ బన్సాల్ తమ కుమార్తె ఇషిక యాదవ్‌ను వేధింపులకు గురిచేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.