రాష్ట్రంలో ఎవరైనా పొరపాటున విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోతే ఇచ్చే ఎక్స్‌గ్రేషియా సొమ్మును పెంచుతూ గతంలో రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వగా.. దాన్ని మరో రూ.3 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బాధితులకు రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని.. అన్ని విద్యుత్ డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే రైతు చనిపోయిన 2 నెలల్లోపే బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఒకవేళ అలా చెల్లించలేకపోతే అందుకు కారణాలు కూడా చెప్పాలని ఆదేశించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెంచిన ఎక్స్‌గ్రేషియాను అందించాలని తేల్చి చెప్పింది. వినియోగదారుల తప్పిదం వల్ల ప్రమాదం జరిగి చనిపోయినా ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సిందేనని తెలిపింది. ఈ నేపథ్యంలోనే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టీఎస్‌ఎన్‌పీడీసీఎల్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లకు సంబంధించిన రిటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్‌ను బుధవారం ఈఆర్సీ రిలీజ్ చేసింది. ఈ ఏడాది కూడా పాత కరెంటు ఛార్జీలే వర్తిస్తాయని.. ఛార్జీల పెంపు ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇళ్ల పైకప్పులపై ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ నుంచి వచ్చే కరెంట్ సరిపోకపోవడంతో అదనపు యూనిట్లు వాడుకుంటే అధిక రేట్ల శ్లాబుల ప్రకారం డిస్కంలు ప్రస్తుతం బిల్లు వసూలు చేస్తున్నాయి. ఇలా వసూలు చేసిన చేసిన సొమ్మును రానున్న 3 నెలల కరెంటు బిల్లులో వెనక్కి ఇవ్వాలని ఈఆర్సీ తెలిపింది. ఇక ఈ ఏడాదిలో మొత్తం కరెంట్ కొనుగోలు వ్యయం రూ.54,567 కోట్లకు అనుమతించాలని.. రెండు డిస్కంలు విజ్ఞప్తి చేయగా.. విచారణ తర్వాత రూ.49,230 కోట్లకే ఈఆర్‌సీ అంగీకారం తెలిపింది. మరోవైపు.. ఈ సంవత్సరంలో అన్ని వ్యయాలు కలిపి రూ.72,996 కోట్లు అవుతాయని డిస్కంలు వివరించగా.. ఈఆర్సీ మాత్రం రూ.64,950.72 కోట్లకే ఆమోదం తెలిపింది. మరోవైపు.. ఈ ఏడాదిలో టీఎస్‌ఎన్‌పీడీసీఎల్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఆదాయం, వ్యయాల మధ్య రూ.15,105.91 కోట్ల లోటు ఉంటుందని ఈఆర్‌సీ పేర్కొంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం రూ.14 వేల కోట్లను ఇచ్చేందుకు అంగీకరించినట్లు వివరించింది. మిగిలిన లోటును డిస్కంల రెగ్యులేటరీ ఎసెట్‌ కింద పరిగణించాలని పేర్కొంది.