వివాహిత పుట్టింటి ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వివాహితకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిపై భర్త హక్కుకు సంబంధించి కీలక తీర్పును వెల్లడించింది. ఒకవేళ హిందూ వివాహిత సంతానం లేకుండా చనిపోతే.. ఆమెకు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ( వారసత్వంగా సంక్రమించిన)పై ఆమె భర్తకు ఎలాంటి హక్కు లేదని తెలిపింది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 15(2)(ఏ) ప్రకారం ఆ ఆస్తిపై హక్కు చనిపోయిన వివాహిత తండ్రి చట్టబద్ధమైన వారసురాలికి దక్కుతుందని తెలిపారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఓ కేసు గిఫ్ట్ డీడ్ విషయంలో వివాదంపై ఆర్డీవో, జేసీ (జాయింట్ కలెక్టర్) ఆదేశాలు విరుద్ధంగా ఉండటంతో హైకోర్టు ఈ కీలక తీర్పును వెల్లడించింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోటకు చెందిన వెంకాయమ్మ కుమారుడు దత్తాత్రేయకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రీవిరితకు శ్రీరామదొరతో వివాహంకాగా.. 2002లో నాయనమ్మ వెంకాయమ్మ శ్రీవిరితకు 1.50 ఎకరాలు శ్రీవిరితకు గిఫ్ట్‌ డీడ్ కింద ఇచ్చారు. ఈ భూమిని రెవెన్యూ రికార్డులో శ్రీవిరిత పేరుపై చేర్చి పాస్ బుక్ ఇచ్చారు. శ్రీవిరిత 2005లో చనిపోయారు.. ఈ క్రమంలో నాయనమ్మ వెంకాయమ్మ 2007లో గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకున్నారు. ఆ భూమిని వెంకాయమ్మ 2011లో రెండో మనవరాలు దేవికి మానసుకు గిఫ్ట్‌గా ఇచ్చారు.. ఆ మరుసటి ఏడాది వెంకయమ్మ చనిపోయారు. ఆ1.50 ఎకరాల భూమిని 2017లో దేవిక మానస పేరుతో రెవెన్యూ రికార్డుల్లో చేర్చేందుకు నర్సీపట్నం ఆర్డీవో ఉత్తర్వులు ఇచ్చారు. అయితే శ్రీవిరిత భర్త శ్రీరామదొర ఈ ఉత్తర్వులపై జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. జేసీ 2023లో ఆర్డీవో ఉత్తర్వుల్ని తప్పుబట్టారు.. ఒకసారి గిఫ్ట్‌ డీడ్ ఇస్తే రద్దు చేసేందుకు వీల్లేదని.. ఒకవేళ రద్దు చేయాలంటే కోర్టును ఆశ్రయించాలన్నారు. జేసీ ఉత్తర్వుల్ని దేవిక మానసతో పాటుగా ఆమె తండ్రి దత్తాత్రేయ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఇద్దరి తరఫున లాయర్.. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 15(2)(ఏ)ను గుర్తు చేశారు. జేసీ ఇచ్చిన ఉత్తర్వులు ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని కోర్టులో వాదనలు వినిపించారు. జేసీ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేసి దేవిక మానస పేరును రెవెన్యూ రికార్డుల్లో చేర్చేలా ఆదేశించాలని హైకోర్టును కోరారు. పిటిషనర్ల తరఫున లాయర్ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి కీలక తీర్పును వెల్లడించారు. తల్లిదండ్రుల నుంచి హిందూ మహిళకు వారసత్వంగా వచ్చిన ఆస్తిపై ఆమె భర్తకు హక్కు ఉండదని స్పష్టం చేశారు. హిందూ వారసత్వ చట్టం సెక్షన్‌ 15(2)(ఏ)ను తీర్పులో ప్రస్తావించారు. చనిపోయిన మహిళకు సంతానం లేకపోతే ఆ ఆస్తి తిరిగి ఆమె తండ్రి తరఫు వారసులకు చెందుతుందని తేల్చి చెప్పారు. ఈ కేసులో శ్రీవిరిత భర్త శ్రీరామదొర ఆ 1.50 ఎకరాల భూమిపై హక్కును పొందలేరని కోర్టు తెలిపింది. శ్రీరామదొర శ్రీవిరితకు వెంకాయమ్మ రాసిన డీడ్‌ను సవాల్ చేయడానికి వీల్లేదని కోర్టు తెలిపింది. దేవిక మానస పేరును 1.50 ఎకరాలకు వారసురాలిగా రెవెన్యూ రికార్డుల్లో చేర్చాలని పాయకరావుపేట తహసీల్దారును హైకోర్టు ఆదేశించింది.