ఒకటో తేదీ షాక్.. మళ్లీ భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. లేటెస్ట్ రేట్లు ఇవే..

Wait 5 sec.

April 1 Gas Cylinder Prices: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఏప్రిల్ ఒకటో తేదీన మళ్లీ పెరిగాయి. కొద్ది రోజుల కిందట మార్చి నెలలో డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధర అదే విధంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని భారీగా పెంచగా.. ఇప్పుడు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్ని మాత్రమే పెంచాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. ఈ కొత్త రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ. 195.50 మేర పెరిగింది. ఇప్పుడు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు ఇక్కడ రూ. 2078.50 కి చేరింది మార్చి 31 వరకు ఇది రూ. 1884.50 గానే ఉంది. కోల్‌కతాలో రూ. 218 మేర పెరగడం గమనార్హం. ఇక్కడ ఇప్పుడు 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 2208 కి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చూస్తే ప్రస్తుతం 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2031 గా ఉండగా.. చెన్నైలో రూ. 2,248.50 గా కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో చూస్తే మార్చిలో రూ. 144 కుపైగా పెరిగి రూ. 2,105 కు చేరగా.. ఇప్పుడు రూ. 2250 మార్కు దాటిందని తెలుస్తోంది. గృహ అవసరాలకు వినియోగించేటువంటి డొమెస్టిక్ గ్యాస్ సిలింఢరల్ని మార్చలేదు. ప్రస్తుతం 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ నగరంలో రూ. 965 గా ఉంది. ఢిల్లీలో రూ. 913 పలుకుతోంది. చెన్నై, ముంబైల్లో చూస్తే ఈ గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా రూ. 928.50, 912.50 గా ఉన్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధరలు ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.