నేటి నుంచి రాష్ట్రంలో చికెన్ షాపులు బంద్.. మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్

Wait 5 sec.

ఒకప్పుడు ఆదివారం వస్తేనే ఇంట్లో ముక్క ఉడికేది. కానీ ఇప్పుడు మాత్రం వారంతో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు అలా షాప్‌కు వెళ్లి మాంసం తెచ్చుకుని.. ఇలా వండేస్తున్నారు. ఇక రెస్టారెంట్లలో చేసే రకరకాల వెరైటీ వంటకాలను కూడా ట్రై చేస్తున్నారు. దీనికితోడు తెలంగాణ అంటేనే.. నాన్ వెజ్ ప్రియులు అధికంగా ఉంటారు. దీంతో సాధారణంగానే చాలా ఇళ్లల్లో వారానికి 2, 3 రోజులు మాంసం రుచులు ఘుమఘుమలాడుతాయి. అయితే మటన్ కావాలంటే కిలోకు రూ.1000 ఉండడంతో చాలా ఫ్యామిలీలు చికెన్‌తో సరిపెట్టుకుంటున్నాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా అయ్యాయి. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ తగ్గించడాన్ని నిరసిస్తూ.. పౌల్ట్రీ కంపెనీలు గతంలో ఇచ్చే మార్జిన్‌ను ఒక్కసారిగా తగ్గించడంతో చికెన్ షాప్ ఓనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆర్థికంగా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. మార్జిన్‌ తగ్గించడంతో షాపుల నిర్వహణ కష్టంగా మారిందని చెబుతున్నారు. తమకు పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవడం లేదని తెలిపారు. గతంలో కిలో చికెన్‌పై రూ.30 నుంచి రూ.35 వరకు లాభాలు వచ్చేవని.. కానీ ఇప్పుడు మాత్రం.. ధరలు పెరగడం వల్ల అన్ని ఖర్చులు పోను కిలోకు కేవలం రూ.5 నుంచి రూ. 6 మాత్రమే మిగులుతోందని వాపోతున్నారు. చికెన్ షాపుల రెంట్‌లు, కరెంట్ బిల్లులు, పని చేసేవారికి జీతాలు, నీటి ఖర్చులు కలిసి భారీగా అవుతున్నాయని.. వీటితోపాటు వేస్టేజ్, అమ్ముడుపోని మాంసం వల్ల మరింత భారం పడుతుందని చికెన్ షాప్ ఓనర్స్ గగ్గోలు పెడుతున్నారు. లాభాలు మొత్తం పెద్ద పెద్ద పౌల్ట్రీ కంపెనీలకే వెళ్తున్నాయని.. రిటైల్ షాపులను ఆదుకునేందుకు తమకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కిలోకు రూ.26 వరకు ఉన్న మార్జిన్‌ను ప్రస్తుతం రూ.16కు తగ్గించటంతో తమపై ఆర్థిక భారం పడుతోందని చికెన్‌ దుకాణాల యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్జిన్‌ను రూ.30కి పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు.గతంలో ఉన్న ధర ఆధారంగా.. తాము హోటళ్లు, ఇతర బల్క్‌ ఆర్డర్లు ఇచ్చే వారితో ధరకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నామని.. ఇప్పుడు ఒక్కసారిగా తమకు ఇచ్చే మార్జిన్ తగ్గించడం వల్ల.. నష్టం వస్తుందని గోడు వెళ్లబోసుకుంటున్నారు. గతంలో ఇచ్చినట్టే ఇప్పుడు కూడా మార్జిన్ ఇవ్వాలని పౌల్ట్రీ కంపెనీలను చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఇక.. మార్జిన్ తగ్గించడానికి గల కారణాలను పౌల్ట్రీ కంపెనీలు చెబుతున్నాయి. కోళ్లకు దాణా, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు భారీగా పెరిగాయని పేర్కొంటున్నాయి. తాము చేస్తున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద భారీగా నిరసన చేపట్టాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని చికెన్ షాపుల ఓనర్లు అంతా ఈ బంద్‌లో పాల్గొని.. పౌల్ట్రీ కంపెనీలు దిగి వచ్చేలా చేయాలని విజ్ఞప్తి చేసింది. పౌల్ట్రీ కంపెనీలు స్పందించి మార్జిన్ పెంచే వరకు తాము చేసే పోరాటం ఆగదని చికెన్ షాప్ ఓనర్స్ స్పష్టం చేశారు. మరోవైపు.. బంద్‌ పాటించకుండా, అసోసియేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చికెన్ షాపులు తెరిచే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చికెన్ షాప్ ఓనర్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల రిటైల్ చికెన్ సెంటర్లు ఉండగా.. అందులో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 8 వేల నుంచి 10 వేల వరకు దుకాణాలు ఉన్నాయి. ఈ చికెన్ సెంటర్ల వ్యాపారంపై ఆధారపడి లక్షల మంది కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాంటి చికెన్ షాపులు మూతపడితే ఇప్పుడు పరిస్థితులు దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.