: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ షాక్ తగులుతోంది. ఇటీవల పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్- యుద్ధం నేపథ్యంలో ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా పెరుగుతున్నప్పటికీ.. ఇప్పుడు . ఏప్రిల్ 2న చూస్తే బంగారం, వెండి రేట్లు భారీ స్థాయిలో ఎగబాకాయి. చాలా రోజుల తర్వాత ధరలు ఇంత పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో.. అదే విధంగా దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం. దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర ఒక్కరోజులోనే రూ. 3150 పెరగడంతో ఇప్పుడు వార్త రాసే సమయంలో ఏప్రిల్ 2 ఉదయం 7 గంటలకు తులం రూ. 1,40,200 కు చేరింది. దీనికి ముందు వరుసగా 5 రోజుల వ్యవధిలో కూడా రూ. 1150, రూ. 150, రూ. 2300, రూ. 950 మేర పెరిగింది. ఇక గత 10 రోజుల్లో ధర రూ. 9 వేల వరకు పెరిగింది. మార్చి నెలలో కనిష్ఠ స్థాయితో చూస్తే రూ. 15 వేలకుపైగానే పెరిగిందని చెప్పొచ్చు. మార్చి 23న ఒక దశలో భారీగా తగ్గి తులం రూ. 1.24 లక్షల స్థాయికి కూడా పడిపోయింది. అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోంది. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో రూ. 3440 పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,52,950 వద్ద ఉంది. ఇది దీనికి ముందు వరుసగా రూ. 1250, రూ. 170 మేర పెరిగింది. ఇక్కడ బంగారం ధరలు పెరిగేందుకు ట్రంప్ చేసిన ప్రకటనే కారణం. ఇరాన్‌తో యుద్ధం మరో 3 రోజుల్లో ముగుస్తుందని తాజాగా ట్రంప్ మరో ప్రకటన చేశారు. తమ వ్యూహాత్మక లక్ష్యాల్ని సాధించామని.. ఇరాన్‌పై విజయం సాధించామని చెప్పుకొచ్చారు. ఇరాన్ కూడా యుద్ధం ముగించేందుకు సుముఖంగానే ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఇటీవల బ్యారెల్‌కు 115 డాలర్ల మార్కుపైకి చేరగా.. ఇప్పుడు అది 100 డాలర్ల స్థాయికి పడిపోయింది. దీంతో పెట్టుబడిదారులు.. బంగారం, వెండి వంటి లోహాలపైకి పెట్టుబడుల్ని తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే రేట్లు పుంజుకుంటున్నాయి. ఇక వెండి ధర ఒక్కరోజే రూ. 15 వేలు పెరగడంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీకి రూ. 2.65 లక్షల వద్ద ఉంది. కిందటి రోజు ఇది రూ. 5 వేలు తగ్గడం గమనార్హం. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10 గ్రాములు) ప్రస్తుతం 4700 డాలర్ల మార్కుపైన ఉంది. 3 రోజుల కిందట ఇది 4400 డాలర్ల స్థాయిలో ఉండేది. ఇక సిల్వర్ రేటు 73 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇంకా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 93.45 వద్ద కొనసాగుతోంది.