డీఏ పెంపుపై కీలక అప్డేట్.. ఏప్రిల్ తొలి వారంలోనే ప్రకటన.. ఈసారి ఎంత పెంచొచ్చు, అంచనాలివే?

Wait 5 sec.

DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్‌నెస్ల్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెంపు ప్రకటన కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జనవరి, 2026 నెలకు సంబంధించిన డీఏ పెంపు ఇప్పటి వరకు ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి, 2026 నెల సైతం పూర్తయింది. ఏప్రిల్ నెల నుంచి కొత్త ఆర్థిక ఏడాది సైతం మొదలవుతోంది. ఈ ఏప్రిల్ నెలలోనైనా డీఏ పెంపుపై ప్రకటన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు విశ్లేషకులు. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే డీఏ పెంపుపై ప్రకటన ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మరి ఈసారి ఎంత ఉండవచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ పెంపు ఉంటుంది. జనవరి, జులై నెలల్లో పెంపు చేపడతారు. అయితే, ప్రభుత్వం చాలా సార్లు అదే నెలల్లో చేయలేదు. పండగలకు ముందు డీఏ పెంపు ప్రకటన చేస్తున్నారు. అందుకే ఈ ఏడాది ఉంటుందని అంతా భావించారు. కానీ, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత మార్చి 25వ తేదీన జరిన కేంద్ర కేబినెటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని అనుకున్నా అప్పుడు సైతం ఏ నిర్ణయమూ వెలువడలేదు. అయితే, డీఏ పెంపు అనేది కేబినెట్ అమోదం, ప్రకటన టైమింగ్ వంటి పెద్ద ప్రాసెస్‌గా నిపుణులు చెబుతున్నారు. ఈసారి మాత్రం 8వ వేతన సంఘంలోకి మారే ప్రక్రియ డీఏ పెంపు ప్రకటనను ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత రివిజన్ అనేది ప్రస్తుత ఫార్ములా ప్రకారమే ఉంటుందని చెబుతున్నారు. ఏప్రిల్ తొలి వారంలోనే ప్రకటన?2025లో ప్రభుత్వం జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపు ప్రకటనను మార్చి 28వ తేదీన చేసింది. ఇప్పుడు మార్చి నెల పూర్తయిపోయింది. అయితే, ఏప్రిల్, 2026 తొలి వారంలోనే ప్రభుత్వం నుంచి డీఏ పెంపు ప్రకటన ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి డీఏ 2 శాతమా లేదా 3 శాతమా?డీఏ ఎంత పెంచాలనే అంశాన్ని ద్రవ్యోల్బణం నిర్ణయిస్తుంది. సీపీఐ-ఐడబ్ల్యూ 12 నెలల సగటు ఆధారంగా డీఏను నిర్ణయిస్తారు. ఇప్పటికే 12 నెలల డేటా అందుబాటులో ఉన్న క్రమంలో ఈసారి డీఏ పెంపు అనేది 2 శాతంగా ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. 2 శాతం డీఏ పెంచితే కరువు భత్యం 60 శాతానికి చేరుకుంటుంది. అయితే, ప్రభుత్వం ఎప్పుడు ప్రకటన చేస్తుంది, ఎంత మేర పెంచుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుత ద్రవ్యోల్బణం ఆధారంగా 2 శాతం పెంచవచ్చన్న అంచనాలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.