ట్యాంక్‌ బండ్ మీద వంద మందికిపైగా ప్రాణాలను కాపాడి రియల్ హీరో అని పేరు తెచ్చుకున్న ట్యాంక్ బండ్ శివకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. కుటుంబం పరిస్థితిని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనేన స్పందించారు. ప్రాణాలకు తెగించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ట్యాంక్ బండ్ శివ.. ప్రస్తుతం ఉపాధి లేక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. దీంతో ట్యాంక్ బండ్ శివ కుటుంబాన్ని తన పిలిపించిన రేవంత్ రెడ్డి.. వారితో మాట్లాడారు. వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్ శివకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ట్యాంక్‌ బండ్‌ శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగం ఇస్తామన్న రేవంత్ రెడ్డి.. హోంగార్డు నియామక పత్రాన్ని వేణుమాధవ్‌‍కు మంగళవారం అందజేశారు. ప్రమాదవశాత్తు, అలాగే వివిధ కారణాలతో హుస్సేన్ సాగర్‌లో పడిన ఎంతోమంది ప్రాణాలను కాపాడిన శివ... ట్యాంక్ బండ్ శివగా పేరు తెచ్చుకున్నారు. అయితే కుటుంబ పోషణ భారమై శివ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియటంతో.. శివ కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో చర్యలు చేపట్టిన అధికారులు.. వారికి జీవనోపాధి కల్పించేలా పలు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శివ కుటుంబం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కలిసింది. ఈ సందర్భంగా ఉపాధి కోసం ట్యాంక్‌ బండ్ దగ్గరలో.. స్విమ్మింగ్ పూల్‌ నిర్మించి ఇవ్వాలని ట్యాంక్ బండ్ శివ ముఖ్యమంత్రిని కోరారు. దీంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీని ద్వారా మరికొంతమంది యువతకు శివ.. ఈతలో శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సొంతిల్లు లేదని తెలుసుకున్న సీఎం.. శివ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. తమ కుటుంబ సమస్యలపై స్పందించి.. సాయం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ట్యాంక్ బండ్ శివ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ముఖ్యమంత్రి చేతుల మీదుగా సాయం అందుకోవటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.