రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక అదే పథకాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా పేరు మార్చి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది. అయితే కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి మాత్రం ఈ రైతు భరోసా అందడం లేదు. దీంతో ఆ రైతులు తమకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల విజ్ఞప్తులపై స్పందించిన ప్రభుత్వం.. వారికి కూడా రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిపింది. కొత్తగా పట్టాదారు పాసు బుక్కులు వచ్చిన రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు పాత లబ్ధిదారులకే అమలు చేస్తున్న రైతు భరోసా పథకాన్ని.. కొత్తగా భూములు కొనుగోలు చేసి.. పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ బుక్కులు పొందినవారు సుమారు 85 వేల మంది రైతులు ఉన్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ 85 వేల మందిలో ఇప్పటికే 62 వేల మంది అన్నదాతలు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేస్తోంది. రైతు భరోసా పథకానికి ఆ రైతులు అర్హత కలిగి ఉన్నారా.. వారి భూమి వివరాలు.. పట్టాదారుల నిజానిజాలను నిర్ధారించిన తర్వాత వారం, 10 రోజుల్లో అర్హులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్‌ను అధికారులు సిద్ధం చేయనున్నారు.రైతు భరోసా పథకానికి అర్హులుగా తేలిన కొత్త అన్నదాతలకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య యాసంగి రెండో విడత రైతు భరోసా నిధులను.. వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో సుమారు రూ. 9 వేల కోట్లను అన్నదాతల అకౌంట్లలో జమ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వానాకాలం సీజన్‌లో లబ్ధి పొందిన ప్రతీ రైతుకు.. ఈ యాసంగి సీజన్‌లో కూడా ఎలాంటి కోతలు లేకుండా పూర్తిస్థాయి పెట్టుబడి సాయం అందనుంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో సుమారు 69.39 లక్షల మంది అన్నదాతలకు ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ. 8,744.13 కోట్లను.. కేవలం 9 రోజుల వ్యవధిలోనే అకౌంట్లలో జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఇక రైతు భరోసా పథకం లబ్ధిదారుల సంఖ్యలో 5.22 లక్షల మందితో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 3.53 లక్షలతో సంగారెడ్డి.. ఖమ్మం 3.35 లక్షలు.. సిద్ధిపేట జిల్లా 3.18 లక్షలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.