హైదరాబాద్‌ కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ సెకండియర్ విద్యార్థిని, నేషనల్ రైఫిల్ షూటర్ మహిమా కీర్తన సిరంగి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం ఒక లేఖ రాసింది. అయితే కొన్ని రోజుల క్రితం నిర్వహించిన తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా అడిగిన ప్రశ్నపై.. మహిమా కీర్తన తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో వచ్చిన ఓ ప్రశ్న లింగ వివక్షను చూపించేలా ఉందంటూ ఆమె సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో వెల్లడించింది. వంట అంటే అమ్మాయిలు మాత్రమే చేయాలా అంటూ ప్రశ్నించింది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలోని ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో డైలాగ్‌ రైటింగ్‌కు రెండు ప్రశ్నలు అడిగారు. కుమార్తెకు వంట నేర్పాలనుకునే తల్లి.. కుమారుడి భవిష్యత్‌ ప్రణాళికల గురించి తెలుసుకోవాలనుకునే తండ్రికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆడపిల్ల అయినంత మాత్రాన తల్లి తన కుమార్తె‌తో వంట గురించి చర్చించడం.. అబ్బాయి అనే కారణంతో కుమారుడు భవిష్యత్‌లో ఏం చేయాలని అనుకుంటున్నాడు అనే ప్రశ్న అడగడంపై మహిమ కీర్తన అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మాయి అయితే వంట గురించి.. అబ్బాయి అయితే ఫ్యూచర్ ప్లాన్స్‌ గురించి అడుగుతారా అని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే వంట అంటే అమ్మాయిలు మాత్రమే చేయాలా.. ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా అమ్మాయిలను వంట గదులకే పరిమితం చేస్తారా అని నిలదీసింది. ఇలాంటి లింగ వివక్షతో కూడిన ప్రశ్నలను, పాఠాలను మార్చాలని మహిమ కీర్తన.. సీఎం రేవంత్ రెడ్డికి పంపించిన లేఖలో అడిగేసింది. ఈ క్రమంలోనే పాఠ్యాంశాల్లో ఉన్న లింగ వివక్షను ప్రశ్నిస్తూ.. ఇదే వ్యవహారంలో తన అభిప్రాయాన్ని కూడా వివరిస్తూ ఈ-మెయిల్‌ ద్వారా మహిమ కీర్తన సీఎంకు లెటర్ పంపించింది. తాను ఎదిగే క్రమంలో తన తల్లి, తండ్రి ఇద్దరూ వంట చేయడం చూశానని.. తనకు కూడా వంట చేయడం ఇష్టమని తెలిపింది. అదే సమయంలో తాను 2023లో జరిగిన అండర్‌ 19 రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో.. తెలంగాణ రాష్ట్ర స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛాంపియన్‌గా నిలిచినట్లు గుర్తు చేసింది. తాను నేషనల్ లెవల్ రైఫిల్‌ షూటర్‌ని అని తెలిపింది. మనం చదివే విద్యా వ్యవస్థ.. సమాజంలో స్త్రీ, పురుషులు సమానమే అని నేర్పించాలని పేర్కొంది. ఇలాంటి లింగ వివక్షకు సంబంధించిన ప్రశ్నలు పరీక్షలో రావడం చూసి తాను చాలా నిరుత్సాహపడినట్లు తెలిపింది. ఇప్పటికైనా ఇలాంటి పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తారని ఆశిస్తున్నట్లు మహిమ కీర్తన తెలిపింది.