తెలంగాణలో చేయూత పథకం కింద కొత్తగా మరిన్ని పెన్షన్లు మంజూరు చేసేందుకు రంగం సిద్ధమైంది. కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.233 కోట్లను కూడా మంజూరు చేసింది. నూతనంగా మరో 2 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పటికే లక్షల సంఖ్యలో పెన్షన్ల కోసం దరఖాస్తులు రాగా.. అందులో లబ్ధిదారుల ఎంపిక కోసం త్వరలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వడబోత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 42.23 లక్షల మంది వివిధ కేటగిరీల్లో ప్రతీ నెలా పెన్షన్లు అందుకుంటున్నారు. అయితే కొత్తగా మరో 2 లక్షల మందికి పింఛన్లను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే 2026-27 ఆర్థిక బడ్జెట్‌లో రూ.233 కోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ బాధితులు, బోదకాల బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్లు అందిస్తోంది. ఇక దివ్యాంగులకు నెలకు రూ.4,016 చొప్పున ఇస్తున్నారు. ఇక గత 3 ఏళ్లుగా బోదకాలు బాధితులు, డయాలసిస్‌ బాధితులు తప్ప కొత్తగా ఎవరికీ పింఛన్లను మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పెన్షన్ కోసం 12 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకుని.. ప్రభుత్వం అనుమతి కోసం వేచిచూస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొత్త పెన్షన్ల కోసం రూ.233 కోట్ల నిధులను ప్రకటించిన తర్వాత అప్లికేషన్ల వెల్లువ కొనసాగుతోంది. గత నెల 20వ తేదీ నుంచి ప్రజావాణి సహా ఇతర కార్యక్రమాల్లో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇక గురువారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో గ్రామాల్లో ఏర్పాట్లు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ గ్రామసభల్లో కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి.. భారీగా అప్లిరేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఉన్న 12 లక్షల అప్లికేషన్లతోపాటు కొత్త దరఖాస్తులు రానుండడంతో.. ప్రభుత్వం ఆమోదం తెలిపిన 2 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం అధికారులకు అతి పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ కోసం 4 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా.. వితంతు, ఒంటరి మహిళల పింఛనుకు 3.5 లక్షల మంది.. చేనేత, గీత కార్మిక పింఛన్ల కోసం 3 లక్షల మంది.. దివ్యాంగుల పింఛనుకు 72 వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు.