సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులో ఉన్న ఏకైక తెలుగు తేజం . ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేసిన ఈ యువ ఆల్‌రౌంటర్ 2024లో అద్భుతమైన ఆటతీరుతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్న ఈ ఆటగాడు.. ఎక్కువ కాలం తన ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. ఐపీఎల్ 2025లో ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ.. ఈ ఏడాది ఆరంభంలోనే ఆల్‌రౌండర్ షోతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య గురువారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి అటు బ్యాట్, ఇటు బాల్‌తో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అవార్డు అందుకుంటున్న సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక క్షోభ గురించి వివరించాడు. "పాజిటివ్‌గా ఉండటానికి చాలా ప్రయత్నించాను, నా మైండ్ నిండా నెగిటివ్ థాట్సే. ఎందుకంటే గత సీజన్‌లో నా ప్రదర్శనే దానికి కారణం. గతేడాది నాకు తగ్గ స్థాయిలో నేను ఆడలేదు. బౌలింగ్ కూడా సరిగా వేయలేదు. నిజంగా నేను బౌలింగ్ విషయంలో చాలా కష్టపడ్డాను, అందుకు తగ్గ ఫలితం కూడా దక్కింది. అది మీతో పాటు నాకు కూడా సంతోషాన్ని ఇచ్చింది. నా బాడీని ఇలా ఫిట్‌గా ఉంచిన నా ట్రైనర్‌కి, ఫిజియోకి థాంక్స్ చెప్తున్నాను" అని నితీష్ కుమార్ రెడ్డి ఎమోషనల్ అయ్యాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన సన్‌రైజర్స్ ఓపెనర్లు కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోశారు. పవర్ ప్లేలో 84 పరుగులు బాదడంతో భారీ స్కోరు ఖరరాయింది. ట్రావిస్ హెడ్ 46, అభిషేక్ శర్మ 48తో ఫామ్‌లోకి రాగా.. హెన్రిచ్ క్లాసెస్ 52, నితీష్ కుమార్ రెడ్డి 39 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మంచి ఆరంభమే ఇచ్చినా మిడిలార్డర్ విఫలమవ్వడంతో ఓటమి తప్పలేదు. అంగ్‌క్రిష్ రఘువంశీ 52, రింకూ సింగ్ 35 పరుగులతో కొద్దిసేపు పోరాడిన సరైన సమయంలో వికెట్లు పడటంతో ఓటమి తప్పలేదు. 16 ఓవర్లలోనే 161 పరుగులు మాత్రమే చేసిన కేకేఆర్ 65 పరుగుల తేడాతో భారీ ఓటమిని అందుకుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒక విజయం సాధించగా, కేకేఆర్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్‌తో 39 పరుగులతో పాటు, బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.