'బైకర్' మూవీ రివ్యూ - రేసునే కాదు మనసుల్నీ గెలిచాడు

Wait 5 sec.

"మొన్న 'నారీ నారీ నడుమ మురారి' సినిమా విషయంలో చెప్పి మరీ హిట్‌ కొట్టాను. ఈసారి 'బైకర్‌'తో బ్లాక్‌బస్టర్‌ కొట్టబోతున్నా".. ఇది ఇటీవల శర్వానంద్ తన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్. సాధారణంగా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్లు కొంతమంది ఉంటే.. సర్లే ఇలా చెప్తేనైనా ఫ్యాన్స్‌కి నమ్మకం కలుగుతుందని చెప్పేవాళ్లు కొంతమంది ఉంటారు. అయితే శర్వా మాత్రం మొదటి రకమే. ఎందుకంటే శర్వా సెలక్షన్ అలా ఉంటుంది మరి. ఇప్పటివరకూ కెరీర్‌లో చేసిన ప్రతి సినిమాలోనూ ఫలితాలతో సంబంధం లేకుండా తన పాత్రకి న్యాయం చేస్తూ ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఒక ఫైనస్ట్ యాక్టర్ అనిపించుకున్నాడు. ఇక ఇటీవలే సంక్రాంతికి హిట్టు కొట్టిన శర్వానంద్.. ఇప్పుడు బైకర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమలో హీరో రాజశేఖర్.. శర్వాకి తండ్రిగా చేయడం మరో విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.బైకర్.. ఫాదర్వికాశ్ నారాయణ్ (శర్వానంద్)‌కి ఫ్యామిలీయే లోకం. తన భార్య అనన్య (మాళవిక నాయర్), కొడుకు ఇషాన్‌లతో కలిసి హాయిగా లైఫ్‌ని లీడ్ చేస్తుంటాడు. ముఖ్యంగా తన కొడుకు చదివిననా చదవకపోయినా నవ్వుతూ నవ్విస్తూ ఆడిస్తూ గడిపేస్తుంటాడు. అయితే ఒకరోజు స్కూల్‌లో తన నాన్న గురించి ఫ్రెండ్‌ తప్పుగా మాట్లాడాడని వాడ్ని రక్తం కారేలా కొడతాడు ఇషాన్. ఈ విషయం తెలుసుకున్న వికాశ్‌ ఒక్కసారిగా తన తండ్రిని గుర్తుకుచేసుకొని బాధపడతాడు. వికాశ్ తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్).. ఒక మోటోక్రాస్ రేసింగ్ కోచ్. ఒకప్పుడు ఎన్నో రేసుల్లో ఛాంపియన్ అయిన సునీల్ సరైన ప్రోత్సాహం, ఇండియాలో మోటోక్రాస్ రేసింగ్‌కి అంతగా ఆదరణ లేకపోవడంతో మరోస్థాయికి వెళ్లలేకపోతాడు. దీంతో తన కొడుకు వికాస్‌ని ఒక ఛాంపియన్‌గా తీర్చిదిద్దాలని కోచింగ్ ఇస్తూ ఉంటాడు. తండ్రిని ఎవరైనా ఒక్కమాట అన్నా విక్కీకి ఎక్కడ లేని కోపం వస్తుంటుంది. తన కొడుకుని ఎప్పటికైనా మోటోక్రాస్ వరల్డ్ ఛాంపియన్‌గా చూడాలని సునీల్ అనుకుంటాడు. అందుకోసం ఒక బడా స్పాన్సరింగ్ కంపెనీని కలుస్తాడు.దాని ఓనర్ ఇంద్రనీల్ (అతుల్ కులకర్ణి).. విక్కీలో టాలెంట్ చూసి తమ కంపెనీతో సునీల్-విక్కీ ఇద్దరూ ఆరేళ్లు వర్క్ చేసేలా బాండ్ రాయించుకుంటాడు. అయితే ఒక్క ఛాంపియన్ షిప్ రేసులో మాత్రమే పాల్గొని తండ్రికి కనీసం చెప్పకుండా ఒక్క లెటర్ మాత్రం రాసి విక్కీ వెళ్లిపోతాడు. అసలు విక్కీ ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది.. తనకి ప్రాణమైన రేసింగ్‌ని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది.. మళ్లీ తిరిగి విక్కీ రేసింగ్ చేశాడా? తన తండ్రి కలని నెరవేర్చాడా? అనేది మిగిలిన కథ.కథలో ఎమోషన్- రైడ్‌లో ప్యాషన్ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ ఫిలిం ఇదేనంటూ బైకర్‌ని బాగా ప్రమోట్ చేశారు. గతంలో కొన్ని సినిమాల్లో ఈ స్పోర్ట్స్ గురించి టచ్ చేసినా కూడా పూర్తి స్థాయిలో దీని మీదే సినిమా రావడం అయితే ఇండియాలో ఇదే మొదటిది. అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమాలు మనకి కొత్తేం కాదు. క్రికెట్, రెజ్లింగ్, హాకీ, ఫుట్‌బాల్ ఇలా చాలా రకాల స్పోర్ట్స్‌పై సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర హిట్టు కూడా కొట్టాయి. అయితే బైక్ రేసింగ్‌తో ఒక కథని తెరకెక్కించడం అంత సులభమైన విషయం కాదు.ఎందుకంటే మన ఇండియన్ ఆడియన్స్ క్రికెట్‌కి కనెక్ట్ అయినంతగా ఈ రేసింగ్‌కి కనెక్ట్ కాలేరు. అయినా కూడా డేరింగ్‌గా ఈ సబ్జెక్ట్‌ని తీసుకొని తమ పెర్ఫామెన్సులు, కథ, కథనం, ఎమోషన్‌తో సినిమాని మరోస్థాయిలో ప్రేక్షకుల ముందు ఉంచాడు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి. ఉదాహరణకి జెర్సీ సినిమాలో కథ, కథనం, ప్యాషన్, డ్రామా, ఎమోషన్ అన్నీ ఏ స్థాయిలో అయితే పండాయో.. బైకర్‌ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులకి ఫీల్ ఇచ్చేలా డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు. అక్కడ క్రికెట్ కాబట్టి మన ఆడియన్స్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు.. కానీ స్పోర్ట్ మారింది కానీ ఎమోషన్ మాత్రం అదే లెవల్లో ఉంది.ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్లన్నీ కూడా థియేటర్లో చూసేటప్పుడు వేరే లెవల్లో అనిపించాయి. ఎక్కడా కూడా సినిమా చూస్తున్నట్లుగా లేదు ఏదో రియల్ రేసింగ్‌ని చూస్తున్న ఫీలింగ్ ఆడియన్స్‌కి కలిగించడంలో టీమ్ సక్సెస్ అయింది. క్లైమాక్స్ రేసింగ్ సీక్వెన్స్.. ఆ తర్వాత నడిచిన డ్రామా అయితే సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది.శర్వా.. రాజశేఖర్ఈ సినిమా కోసం శర్వానంద్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక రేసర్‌లా కనిపించడం కోసం శర్వా పడిన కష్టం, ఆ తపన స్క్రీన్ మీద వృథాపోలేదు. శర్వా బైక్ రేసింగ్ చేసిన ప్రతిసారి స్క్రీన్ మీద ఒక హీరో కాదు రేసర్‌నే చూసిన ఫీలింగ్ వచ్చింది. అలానే ఫాదర్ సెంటిమెంట్‌ని కూడా శర్వా చాలా బాగా పండించాడు. ఇక సినిమాలో బుల్లెట్ నారాయణ పాత్రలో నటించిన రాజశేఖర్ చాన్నాళ్ల తర్వాత ఒక మంచి పాత్రలో మెప్పించారు. హీరోగా మాత్రమే చేద్దామనుకొని ఇలాంటి పాత్రలు ఎన్నో వచ్చినా రాజశేఖర్ వదులుకున్నానంటూ ఇటీవల చెప్పరు. నిజానికి రాజశేఖర్ ఇందులో హీరో పాత్ర చేయలేదు కానీ ఈ కథకి మాత్రం రాజశేఖర్ కూడా హీరోనే. ఎందుకంటే సునీల్ నారాయణ పాత్రే ఈ కథకి ప్రాణం. అలాంటి పాత్రని తన అనుభవంతో, నటనతో మరో స్థాయిలో నిలబెట్టారు రాజశేఖర్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో శర్వానంద్‌కి హగ్గు ఇచ్చే సీన్‌లో రాజశేఖర్ నిజంగా ఏడిపించారు.మాళవిక నాయర్‌కి కూడా ఒక మంచి పాత్ర దక్కింది. ఫస్టాఫ్‌లో గ్లామర్‌తో మెప్పించిన మాళవిక.. ఇంటర్వెల్ ముందు, సెకండాఫ్‌లో నటనతో మెప్పించింది. కథలో ఆమె పాత్ర కూడా కీలకమే కావడంతో చాన్నాళ్ల తర్వాత మాళవికకి మంచి పాత్ర దక్కినట్లయింది. ఇక విలన్‌గా అతుల్ కులకర్ణి మెప్పించారు. చాలా సెటిల్డ్‌గా యాక్ట్ చేశారు. అలానే అన్వర్ పాత్రలో యాక్ట్ చేసిన నటుడి నటన కూడా బావుంది. ఇక బ్రహ్మాజీ, తులసి సహా మిగిలిన యాక్టర్లు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.ఇక సినిమాకి జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయింది. సినిమాలో రేసింగ్ సీన్లకి, ఎమోషనల్ సీన్లకి జిబ్రాన్ ఇచ్చిన బీజీఎమ్ బాగా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. ఇక సినిమలో డైలాగులు ఎక్కువగా లేకపోయినా కూడా ఉన్న డైలాగులన్నీ కథని మరింత బలంగా ఆడియన్స్‌ని తాకేలా రాశారు. "చీకటి గదిలో ఎవరో రాసిన కథలు చూడటానికి నువ్వు అలవాటు పడిపోతే.. రేపు నీ కథ నువ్వు రాయలేవు", "రేసింగ్ నీ లైఫ్.. కానీ నువ్వు మా లైఫ్", "ప్రతి కొడుక్కీ యుద్ధంలో నాన్నే మొదటి సైనికుడు" అంటూ చెప్పిన కొన్ని డైలాగులు ఆయా సన్నివేశాల్ని మరింత ఎలివేట్ చేశాయి. ఓవరాల్‌గా శర్వానంద్ అయితే చెప్పినట్లే ఈసారి హిట్టు కాదు బ్లాక్ బస్టర్ కొట్టే కంటెంట్ అయితే ఇచ్చాడు.ఒక్కమాటలో చెప్పాలంటే.. బైకర్.. రేసునే కాదు మనసుల్నీ గెలిచాడు