యువకుడికి ఉద్యోగం కావాలని అడిగితే చంద్రబాబు ఆటో కొనివ్వమని చెప్పారా.. వీడియోపై క్లారిటీ, అసలేం జరిగిందంటే?

Wait 5 sec.

ఓ తల్లి తన కుమారుడికి ఉద్యోగం కావాలని అడిగితే ముఖ్యమంత్రి అతడికి ఆటో కొనివ్వమని చెప్పారంటూ సోషల్ మీడియా వేదికంగా ఓ వీడియో వైరల్ అవుతోంది. 'ఇవి చంద్రబాబు తెలివితేటలు.. మా బాబు డిగ్రీ చేశాడు, ఖాళీగా ఉంటున్నాడు ఏదైనా జాబ్ ఇప్పించండి సార్ అని అడిగితే.. ఆటో ఇప్పించండి అంటున్నాడు' అంటూ కొందరు ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఉద్యోగం అడిగితే ముఖ్యమంత్రి ఆ యువకుడికి ఆటో కొనివ్వమని చెప్పడం ఏంటంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోను నిజమని నమ్మి చాలామంది షేర్ చేస్తు్న్నారు.. కానీ అక్కడ జరిగింది వేరు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వేరు అని , మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలోని నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముక్కర అంబిక అనే లబ్దిదారు ఇంటికి చంద్రబాబు వెళ్లారు.. అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ తర్వాత వారి కుటుంబ పరిస్థితులు, కష్ట సుఖాలు అడిగి తెలుసుకునే క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి కొన్ని హామీలు ఇచ్చారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. అంబిక భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఆయనకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న ఇంటి గడప దగ్గర ఉన్న మరొక మహిళ తన కుమారుడి ఉద్యోగం కావాలని ప్రస్తావించారన్నారు. ముఖ్యమంత్రి అంబిక భర్తకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాలి అని ఇచ్చిన ఆదేశాలను ఆ మహిళ అడిగిన విషయానికి జత చేసి ‘‘చదువుకున్న వ్యక్తికి ఆటో కొనిపెడతారట’’ అంటూ సోషల్ మీడియాలో అపహాస్యం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. రెండు వీడియోలను కలిపి తప్పుడు అర్ధం వచ్చేలా ఎడిట్ చేసి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని.. ఇలాంటి ప్రయత్నాలు చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసకుంటామని ఫ్యాక్ట్ చెక్ టీమ్ హెచ్చరించింది.కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పాలనతో ముందుకు సాగుతోందని.. వైఎస్సార్‌సీపీకి ఎలాంటి లోటుపాట్లు దొరక్క తప్పుడు వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి నారా లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియోను కట్ అండ్ పేస్టుతో తప్పుడు అర్ధం వచ్చేలా వారు చేస్తున్న ఒక వీడియో ప్రచారం తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ ఘటనలో ఏం జరిగిందో వివరించారు. 'తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా ముక్కర అంబిక అనే లబ్దిదారు ఇంటికి వెళ్లి అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకునే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి కొన్ని హామీలు ఇచ్చారు. అంబిక భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఆయనకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న ఇంటి గడప వద్ద ఉన్న మరొక మహిళ తన కుమారుడి ఉద్యోగం విషయం ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి అంబిక భర్త కు బ్యాటరీ ఆటో కొనిపెట్టాలి అని ఇచ్చిన ఆదేశాలను ఆ మహిళ అడిగిన విషయానికి జత చేసి ‘‘చదువుకున్న వ్యక్తికి ఆటో కొనిపెడతారట’’ అంటూ సోషల్ మీడియాలో అపహాస్యం చేసే ప్రయత్నాన్ని వైఎస్సార్‌సీపీ ప్రారంభించింది' అని మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్‌‌సీపీ ఇలాంటి తప్పుడు ప్రచారంతో సాధించేది ఏమీ ఉండదన్నారు.. రాష్ట్ర ప్రజలందరికి ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల పక్షపాతిగా సముచిత నిర్ణయాలను మాత్రమే తీసుకుంటారని తెలుసన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను మానుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు మంత్రి లోకేష్.