అభిషేక్ శర్మపై బీసీసీఐ సీరియస్, ఫైన్.. కేకేఆర్ మ్యాచ్‌లో గొడవే అసలు కారణం!

Wait 5 sec.

సన్‌రైజర్స్ హైదరాబాద్ డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మపై బీసీసీఐ సీరియస్ అయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఘటనను మ్యాచ్ రిఫరీ తప్పుబట్టాడు. దాంతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్న బీసీసీఐ.. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారనే కారణంతో మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించారు. ఈ మ్యాచ్‌లో బౌండరీతో విరుచుకుపడిన హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్న సమయంలో క్యాచ్ రూపంలో అవుటయ్యాడు. అయితే వరుణ్ చక్రవర్తి పట్టిన ఆ క్యాచ్ కాస్త కన్ఫ్యూజన్‌గా ఉండటంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేశాడు. క్యాచ్ పట్టుకునే సమయంలో బంతి నేలను తాకుతున్నట్లు కనిపించింది. అందరూ నాటౌట్‌ అనుకుంటే థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. దాంతో అసహనానికి గురైన అభిషేక్ శర్మ అంపైర్‌ని అసభ్య పదజాలంతో దూషించాడు. పెవిలియన్‌కు వచ్చిన తర్వాత తన తప్పును అభిషేక్ శర్మ అంగీకరించాడు. అయితే, మ్యాచ్‌లో ప్రవర్తన సరిగా లేని కారణంగా జరిమానా విధించేందుకు మ్యాచ్ అధికారులు నిర్ణయించారు. దాంతో మ్యా్చ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఆర్టికల్ 2.3 కింద లెవల్ 1 నేరాన్ని అభిషేక్ శర్మ అంగీకరించడం గమనార్హం. "అభిషేక్ శర్మ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించాం. అలాగే అతనికి ఒక డీ మెరిట్ పాయింట్ కూడా ఇచ్చాం. లెవల్ 1 నేరాలకు మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయమే ఫైనల్‌గా ఉంటుంది" అని ఐపీఎల్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అసభ్య పదజాలాన్ని ఎవరైనా ఉపయోగిస్తే వారికి ఆర్టికల్ 2.3 కింద లెవల్ 1 నేరం వర్తిస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 48 పరుగులు బాదాడు. ట్రావిస్ హెడ్ 46, క్లాసెన్ 52, నితీష్ కుమార్ రెడ్డి 39 పరుగులతో విరుచుకుపడటంతో 20 ఓవర్లలో 226/8 పరుగులు చేసింది. భారీ లక్ష్యం ముందు కోల్‌కతా తడబడటంతో 16 ఓవర్లలోనే 161 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో సన్‌రైజర్స్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.