ఆరేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌కు వేదికైన ఈడెన్ గార్డెన్స్ ఒక్కసారిగా ఈడెన్ ఘోస్ట్ పిచ్‌గా మారింది. అసలు ఎవ్వరి ఊహాలకు అందని విధంగా పిచ్ స్వరూపం మారిపోయింది. తొలిరోజే 11 వికెట్లు టపాటపామంటూ రాలిపోగా.. ఇక మిగతా రెండ్రోజుల్లో ఆట మొత్తం ముగిసేసింది. దాంతో ఈ పిచ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య 2019లో పింక్ బాల్ టెస్టు జరిగింది. ఆ తర్వాత నుంచి ఈ పిచ్‌లో మరో టెస్టు మ్యాచ్ జరగలేదు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ప్రెసిడెంట్‌గా సౌరవ్ గంగూలీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈడెన్ గార్డెన్స్ ప్రతిష్టాత్మక భారత్ - దక్షిణాఫ్రికా టెస్టుకు మళ్లీ వేదికైంది. ఎవ్వరూ ఊహించని విధంగా పిచ్‌ని తయారు చేశామని గంగూలీ ముందుగానే చెప్పుకొచ్చాడు. భారత్‌లో ఉన్న పిచ్‌ల కంటే కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. తొలి రెండు రోజులు పేస్‌కి అనుకూలించి, ఆ తర్వాత స్పిన్ వైపునకు మొగ్గు చూపుతుంది. అందరూ అదేవిధంగా అనుకున్నారు. కానీ భారత్ - దక్షిణాఫ్రికా టెస్టులో అసలు అదేం కనిపించలేదు. పిచ్ దాని ఇష్టానుసారం ప్రవర్తించి. ఒక బంతి బౌన్స్ అయ్యి కీపర్ భుజాలపైకి లేస్తే.. ఆ తర్వాత బంతే కనీసం రెండు, మూడు అడుగులు కూడా లేవకుండా ఎల్‌బీడబ్ల్యూగా వెళ్లిపోయింది. ఇది పిచ్ టర్నర్ అనడానికి కూడా లేదు. ఎందుకంటే కనీసం రెండు రోజులు బంతులు పడిన తర్వాతే పిచ్ మెత్తగా మారిపోయి అప్పుడు టర్న్ అవుతుంది. కానీ ఈడెన్ గార్డెన్స్‌లో అవేమీ కనిపించలేదు. దాంతో ఇది పూర్తి పిచ్ క్యూరియేటర్ వైఫలమ్యే అంటూ రవిచంద్రన్ అశ్విన్ కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. పిచ్‌లో డీమన్స్ ఉన్నాయంటూ పేస్ దిగ్గజం డేల్ స్టేన్ ఒపీనియన్ చెప్పాడు. కుంబ్లే కూడా తాను ఈడెన్ గార్డెన్స్ చరిత్రలో పిచ్ ఇలా ప్రవర్తించడం చూడలేదని పేర్కొన్నాడు. అయితే, టీమిండియా హెడ్ కోచ్ మాత్రం పిచ్ చాలా బాగుందంటూ వ్యాఖ్యలు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ భారీ స్కోర్ చేస్తుంది అనుకుంటే 189 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా సఫారీలు 153 పరుగులకే కట్టడి అయ్యారు. సునాయాసంగా ఛేదిస్తుంది అనుకున్న భారత్ ఎవ్వరూ ఊహించని విధంగా 93 పరుగులకే ఆలౌట్ అయ్యి ఫ్యాన్స్‌కు షాక్‌ని ఇచ్చింది. దాంతో తొలి టెస్టులో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో లీడింగ్‌లో నిలిచింది.