ఆంధ్రప్రదేశ్‌లో అరటి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.. గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. ఈపరిణామాలపై అనంతపురం జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. అరటి రైతులకు న్యాయం చేయాలని, నాణ్యత పేరుతో వారిని మోసం చేయవద్దని కలెక్టర్ ఆనంద్ వ్యాపారులను ఆదేశించారు. కిలో అరటిపండ్లను కనీసం రూ.6కు తగ్గకుండా కొనుగోలు చేయాలని సూచించారు. లేని పక్షంలో డ్వాక్రా మహిళల ద్వారా అరటి కాయల్ని కొనుగోలు చేయించి ఇంటింటా విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా చేస్తే వ్యాపారులే నష్టపోతారని కలెక్టర్ హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో ఉద్యాన అధికారులు, అరటి వ్యాపారులు, ఎగుమతిదారులతో సమీక్ష చేశారు.మరీ దారుణంగా కిలో అరటిపండ్లు రూ.2, 3లకు పడిపోవడానికి కారణమేంటని కలెక్టర్ ఆరా తీశారు. రెండో పంట దిగుబడిలో అరటిపండ్ల నాణ్యత తగ్గిందని వ్యాపారులు చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో కూడా ఇదే పంట నాణ్యతగా ఉండటంతోనే ఇక్కడ ధర తగ్గిందని వివరించారు. అనంతపురం జిల్లాలో అరటి సాగుకు మంచి ఆదరణ లభిస్తోంది. మొత్తం 38,984 ఎకరాల్లో రైతులు అరటిని పండిస్తున్నారు. ఈ సాగులో మూడు రకాల పంటలు ఉన్నాయి. మొదటి పంట 19,570 ఎకరాల్లో, రెండో పంట 14,789 ఎకరాల్లో, మూడో పంట 4625 ఎకరాల్లో సాగులో ఉన్నాయి. ప్రస్తుతం మూడో పంట కోత పూర్తయ్యింది. రెండో పంటలో కూడా 80 శాతం కోత పూర్తయింది. ఇక మొదటి పంట కోత డిసెంబరు నెలలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అరటి పండ్ల రిటైల్ ధర కిలో రూ.25 పలుకుతోంది. అయితే, రైతులు పండించిన అరటిని వ్యాపారులు తక్కువ ధరకు కొనడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. దీనిపై కలెక్టర్ స్పందించారు.. రైతుల నుంచి వ్యాపారులు కనీసం కిలో రూ.6కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలాగే ఎగుమతి చేసేవారు కూడా కిలో రూ.8కు తగ్గకుండా కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని కలెక్టర్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాదు సామాన్యులు కూడా ఈ అరటిపళ్లను కేజీ రూ.6 చొప్పున ఎన్నైనా కొనుగోలు చేయొచ్చు, తీసుకెళ్లొచ్చు.