రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ.. మంత్రి తుమ్మల కీలక కామెంట్స్

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విడతల వారీగా రూ.2 లక్షల వరకు చేశారు. మెుత్తం 25.36 లక్షల మంది రైతుల ఖాతాల్లో 25 వేల కోట్లు జమ చేశారు. తాజాగా రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక కామెంట్స్ చేశారు. ఏకకాలంలో మాఫీ చేయడం రేవంత్ ప్రభుత్వం సాధించిన చారిత్రక ఘనత అని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంత భారీ మొత్తంలో రైతు రుణాలను ఏ రాష్ట్రంలోనూ ఏకకాలంలో మాఫీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 25.36 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం దేశంలోనే తొలిసారని మంత్రి తెలిపారు. కేంద్రంలో గత 13 సంవత్సరాలుగా మోదీ పాలన ఉన్నా.. ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన దాఖలాలు లేవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధర (MSP) విషయంలో అనుసరిస్తున్న విధానాలపై మంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతి సీజన్ ఆరంభంలో మద్దతు ధర పెంచామని గొప్పలు చెప్పుకోవడం తప్ప, రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాలనే విషయంలో ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. కొనుగోలు చేసే కొన్ని పంటలకు కూడా రకరకాల పరిమితులు విధించి రైతులను రోడ్డున పడేశారని, దీంతో మిగతా పంటను దళారులకు అమ్ముకుని రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాఫెడ్ ద్వారా జరిగే సోయాబీన్ కొనుగోళ్లలో ఆధార్ అథెంటికేషన్ నిబంధన పెట్టడం వల్ల కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.కేంద్రం నుండి ఎలాంటి సహకారం లేకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ OTP సదుపాయాన్ని తీసుకొచ్చి కొనుగోళ్లు చేస్తోందని రూ. 2,500 కోట్లు వెచ్చించి మొక్కజొన్నను మద్దతు ధరతో కొనుగోలు చేస్తోందని తెలిపారు. పత్తి కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. పత్తి పంటను కొనుగోలు చేయాల్సిన ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని తుమ్మల స్పష్టం చేశారు. కిసాన్ కపాస్ యాప్, అధిక తేమ శాతం పరిమితి, ఎకరానికి 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితి, జిన్నింగ్ మిల్లుల విభజన వంటి నిబంధనలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు. పత్తి సీజన్ ప్రారంభమయ్యాక ఈ నిబంధనలు తీసుకురావడం రైతులను గందరగోళంలోకి నెట్టే కుట్ర అని ఆయన ఆరోపించారు. ఎకరానికి 5 క్వింటాళ్ల నుంచి 18 క్వింటాళ్ల వరకు దిగుబడులు నమోదవుతుంటే.. 7 క్వింటాళ్ల పరిమితి పెట్టడానికి సాంకేతిక ఆధారం ఏమిటి? అని నిలదీశారు. 7 క్వింటాళ్ల కంటే అధికంగా పండించిన రైతులు మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలని మంత్రి తుమ్మల ప్రశ్నించారు.