సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి గిల్ ఔట్.. రీప్లేస్‌మెంట్‌గా ఆ యంగ్ ప్లేయర్!

Wait 5 sec.

అసలే కష్టాల్లో ఉన్న టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్ రెండో రోజు గిల్‌కు మెడ గాయమైందని, దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. ఈ టెస్టులో 124 పరుగులు ఛేదించలేక భారత్ 30 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. దాంతో రెండు టెస్టు భారత్‌కు చాలా కీలకంగా మారింది.గాయంతో కూడా గిల్ జట్టుతో కలిసి గౌహతికి ప్రయాణించినప్పటికీ, అక్కడ కూడా ఆడే అవకాశం లేదని తేలిపోయింది. కనీసం పదిరోజుల విశ్రాంతి అవసరం ఉండటంతో అతన్ని రెండో టెస్ట్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. గిల్ స్థానంలో 24 ఏళ్ల టాప్ ఆర్డర్ బ్యాటర్ ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్ 11లో చోటుదక్కించుకోనున్నాడు. ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌లో జరిగిన అండర్సన్ - టెండూల్కర్ సిరీస్‌తో సాయి సుదర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు టెస్టులు ఆడిన సాయి, 30.33 సగటుతో 273 పరుగులు సాధించాడు. చివరిసారిగా వెస్టిండీస్‌పై 39, 87 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ తొలి టెస్ట్‌లో అవకాశం రాలేదు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన భారత్ - దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ రెండో రోజున మెడ గాయం కారణంగా గిల్‌ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం డిశ్చార్జ్ చేసినప్పటికీ, ఐదు రోజుల టెస్ట్ కష్టతరమైన ఫిజికల్ ప్రెషర్ గాయాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉండడంతో వైద్యులు ఆడనివ్వలేదు. గౌహతికి నెక్ బ్రాస్‌ లేకుండా వచ్చిన గిల్ ప్రాక్టీస్‌లో కూడా పాల్గొనలేదు. గిల్‌ పూర్తిగా కోలుకోవడానికి కనీసం పది రోజులు, అదనంగా రిహ్యాబిలిటేషన్ అవసరం. నవంబర్ 30 నుంచి రాంచీలో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌ నుంచి కూడా అతన్ని తప్పించే అవకాశం ఉంది. పెద్ద ప్రాముఖ్యత లేని ఆ సిరీస్‌ బదులుగా డిసెంబర్ టీ20ల కోసం గిల్ అందుబాటులో ఉండాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.