సమాజంలో ఎక్కడ చూసినా నకిలీ తాండవిస్తోంది. తినే తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు అన్నీ ఫేక్ పుట్టుకొస్తున్నాయి. నకిలీ మనుషులు కూడా హల్‌చల్ చేస్తున్నారు. పోలీసులం అని.. రాజకీయ నాయకులం అని.. ప్రభుత్వ అధికారులం అని.. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు చెందిన వారిమి అంటూ చాలా మంది మోసాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తి.. తాను ఎమ్మెల్యే అంటూ దౌర్జన్యానికి దిగాడు. ఏకంగా ఒక ఖరీదైన హోటల్‌కు వెళ్లి డబ్బులు చెల్లించకుండా బస చేస్తున్నాడు. అలా 18 రోజుల పాటు ఉన్నా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో ఆ హోటల్ ఓనర్.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు వచ్చి విచారణ జరపడంతో.. ఆ నకిలీ ఎమ్మెల్యే బాగోతం బయటపడింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా సదర్ కోత్వాలీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక వ్యక్తి తాను ఎమ్మెల్యేనని చెప్పుకొని ఓ హోటల్‌లో 18 రోజుల పాటు అద్దె చెల్లించకుండా బస చేశాడు. ఈ ఘటనలో ఢిల్లీకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని తుగ్లకాబాద్‌కు చెందిన వినోద్, అతని సోదరుడు మనోజ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. వినోద్ తాను ఒక ఎమ్మెల్యేనని.. హోటల్ యజమాని పవన్‌ను నమ్మించాడు. ఇలా 18 రోజుల పాటు ఆ హోటల్ రూమ్‌ను తీసుకుని అద్దె చెల్లించకుండా ఉంటున్నాడు.అయితే రూమ్ అద్దె డబ్బులు హోటల్ యజమాని పవన్ అడిగినప్పుడు.. వినోద్ తన పలుకుబడిని చూపించే ప్రయత్నాలు చేశాడు. దీంతో హోటల్ యజమాని పవన్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు వ్యక్తులు 18 రోజులుగా హోటల్‌లో బస చేస్తున్నారని.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీబీ) ఇమ్రాన్.. వారిలో ఒకరు తమను తాము ఎమ్మెల్యేగా చెప్పుకుంటూ అద్దె చెల్లించడానికి నిరాకరించినట్లు హోటల్ యజమాని ఫిర్యాదు చేశారని తెలిపారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వినోద్‌ను విచారించగా.. అతను ఎమ్మెల్యే కాదని వెల్లడైంది. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వినోద్ నుంచి ఎంపీ (మెంబర్ ఆఫ్ పార్లమెంట్) అని రాసి ఉన్న స్టిక్కర్, హూటర్ అమర్చిన ఒక కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారణ జరపగా.. పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఈ ఇద్దరు వ్యక్తులు గతంలో కూడా నకిలీ గుర్తింపులను ఉపయోగించి పలు దుకాణాలు, రెస్టారెంట్లలో మోసాలకు పాల్పడినట్లు తేలింది. నకిలీ హోదాలతో ప్రజలను మోసం చేయడం.. పోలీసులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.