తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, , ఉపకార వేతనాలు.. అలాగే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలకు దరఖాస్తు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులకు అడ్డుకట్ట వేసేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate) దరఖాస్తుకు ఇకపై రేషన్‌ కార్డును తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన గత వారం నుంచి మీసేవలో అమల్లోకి వచ్చింది.అనర్హులకు దారులు ఎలా తెరుచుకున్నాయి?సంక్షేమ పథకాలు, ఉపకార వేతనాలలో పెద్దఎత్తున అనర్హులు లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. ఇప్పటివరకు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీ-సేవ ద్వారా రెండు రకాలుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అందులో ఒకటి రేషన్ కార్డు ఉన్నవారికి.. అది దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబంగా పరిగణించబడుతుంది కాబట్టి.. ఎలాంటి క్షేత్ర స్థాయి విచారణ లేకుండానే రెవెన్యూ అధికారులు వెంటనే ధ్రువీకరణ పత్రం జారీ చేసేవారు.ఇక రెండోది.. రేషన్ కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఈ విధానంలో రెవెన్యూ అధికారుల క్షేత్ర స్థాయి విచారణ తప్పనిసరి. అయితే.. రెండో విధానంలో భారీగా దరఖాస్తులు వస్తుండటంతో, తహసీల్దార్ కార్యాలయాల్లో విచారణ సరిగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా.. రేషన్ కార్డు లేని దరఖాస్తుదారుల నుంచి అధికారులు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ అవినీతి ధోరణి కారణంగానే ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాల్లో అనర్హులు పెరిగిపోతున్నారని అధికార వర్గాలు గుర్తించాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు రావాలన్నా.. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు కావాలన్నా.. ఇక నుంచి రేషన్ కార్డు తప్పనిసరి కానుంది. అనర్హులను పూర్తిగా అరికట్టే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై.. మీ-సేవలో ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే.. రేషన్ కార్డు లేనివారికి వెంటనే ‘మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు’ అనే సందేశం వస్తుంది. అంటే.. భవిష్యత్తులో రేషన్ కార్డు పొందిన తర్వాతే ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.సామాన్యులపై ప్రభావం..ఈ నిర్ణయం వల్ల నిజమైన పేదలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉండి కూడా రేషన్ కార్డులు లేనివారు తాత్కాలికంగా ఇబ్బందులు పడవచ్చు. అయితే, ప్రభుత్వం ప్రధానంగా ధరలు పెరిగినప్పటికీ, సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ కఠిన చర్య తీసుకుంది. దీనివల్ల నిధులు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.