మీరలా సరదాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు.. చుట్టూ వచ్చీపోయే జనాలను గమనిస్తూ, మనసులో మెగాస్టార్ పాటను హమ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో మీకు ఎదురుగా రోడ్డుపై ఒకటి కనిపించింది.. ఏంటా అని దగ్గరకు వెళ్లి చూస్తే.. అదో ఏటీఎం కార్డు. దానిపై పిన్ నంబర్ కూడా ఉంది. అరేయ్ పాపం ఎవరో పడేసుకున్నారనుకుంటే పర్లేదు. కానీ లచ్చిందేవి.. లచ్చిందేవి.. లచ్చిందేవి.. కలిసొచ్చిన లక్ష్మిదేవి. నడిచి వచ్చిన లక్ష్మిదేవి అనుకుంటూ ఏటీఎం సెంటర్‌కు పరుగులు తీస్తే.. ఇదిగో ఈ మహిళ సంగతే మీకు కూడా.. తమిళనాడులోని వేలూరులో ఈ ఘటన జరగ్గా.. బాధితురాలు ఏపీకి చెందిన వారు..ఇన్బకుమారి అనే మహిళది చిత్తూరు జిల్లాలోని గుడిపాల. ఆమె భర్త మాజీ సైనికుడు. అయితే ఇన్బకుమారి, కుమార్తె రేచల్‌ కలిసి ఇటీవల కళ్లద్దాలు కొనుగోలు చేయడం కోసం వెళ్లారు. వేలూరులోని మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయం వెళ్లారు. అయితే అక్కడి సిబ్బంది ఆధార్ కార్డు వివరాలు కావాలని కోరారు. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని తేవాలని సూచించారు. దీంతో ఇన్బకుమారి సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్ వద్దకు వెళ్లారు. అయితే వెళ్లే సమయంలో.. వారి బ్యాగులోని పిన్ నంబర్ రాసిపెట్టుకున్న స్లిప్ పడిపోయింది. ఈ విషయాన్ని ఇన్బకుమారి గమనించుకోలేదు.అయితే కొద్ది సేపటి తర్వాత బ్యాంక్ ఖాతా నుంచి 50 వేల రూపాయలు డ్రా చేసినట్లు ఇన్బకుమారి మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో బ్యాగ్ చెక్ చేసుకున్న ఇన్బకుమారి . వెంటనే వేలూరు సౌత్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. బ్యాంక్ లావాదేవీ ఆధారంగా ఏ చేశారనే సంగతి గుర్తించారు. ఈ క్రమంలోనే రాజపాళ్యానికి చెందిన దేవి అనే మహిళ డబ్బులు ఏటీఎం సెంటర్ నుంచి డ్రా చేసినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఆ మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా.. కార్డుతో డబ్బులు డ్రా చేసినట్లు అంగీకరించింది. విత్ డ్రా చేసిన 50 వేల రూపాయల్లో 30 వేలు పెట్టి బంగారు కమ్మలు కొనుగోలు చేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు దేవిని అరెస్ట్ చేశారు. ఆమె నుంచి నగలు, రూ.20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోసం జైలుకు తరలించారు.