రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి మంత్రివర్గ మార్పులు, విస్తరణ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో పెద్ద ఎత్తున మార్పులు చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ మొదటి వారం లోపే ఈ రాజకీయ ప్రక్రియ పూర్తికావచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ మార్పులు పరిపాలన మెరుగుపరచడానికి మాత్రమే కాదు.. పార్టీలో ఉన్న అసంతృప్తులను చల్లార్చడానికి.. సామాజిక వర్గాల మధ్య సమతుల్యత పాటించడానికి చేసే వ్యూహాత్మక అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. .. నాలుగోసారి మంత్రి వర్గంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బయటకు వెళ్లే మంత్రులు.. మంత్రివర్గం నుంచి దాదాపు నలుగురు మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేరు ఈ జాబితాలో ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం కోసం పదవి నుంచి తప్పుకోవచ్చనే ఊహాగానాలు బలంగా ఉన్నాయి. సోదరుల మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలను తగ్గించి.. పార్టీలో వారిద్దరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఇది ఒక పెద్ద ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.మిగతా ముగ్గురిలో ఒక మహిళా మంత్రి, ఒక బీసీ మంత్రి, మరొక ఓసీ మంత్రి రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ హైకమాండ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది మంత్రుల పనితీరు అంతగా సంతృప్తికరంగా లేకపోవడం.. మరికొందరిపై వ్యక్తిగత వివాదాలు లేదా నియోజకవర్గ సమస్యలు ఉండటం వంటి కారణాల వల్ల ఈ మార్పులు తప్పకపోవచ్చు. మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసే మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పాటించాలనే ఉద్దేశంతో ఉన్నారు.కొత్త వారు వీరే..!కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: ముఖ్యమంత్రికి రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగిస్తున్నా.. పార్టీ హైకమాండ్ ఇచ్చిన హామీ మేరకు ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఇది అసమ్మతిని అదుపు చేసే వ్యూహంలో భాగంగా చెప్పుకోవచ్చు. బి. మహేష్ కుమార్ గౌడ్: ఈయనకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ మార్పును బీసీ మంత్రి స్థానంలో తీసుకువచ్చే ప్రయత్నంగా చూస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ (TPCC) అధ్యక్షుడిగా కొనసాగుతుండగా.. ఈ మార్పు ద్వారా పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఆది శ్రీనివాస్: మున్నూరు కాపు వంటి ముఖ్యమైన సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచడానికి.. అలాగే కోమటిరెడ్డి వర్గానికి ప్రత్యామ్నాయంగా ఈయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇతడు వేముల వాడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. ప్రభుత్వ విప్‌గా ఉన్నారు.విజయశాంతి: ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న విజయశాంతికి మంత్రి పదవి దక్కే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కీలక శాఖల పంపిణీపై ఆసక్తి..మంత్రివర్గ విస్తరణ తర్వాత హోం శాఖ, విద్యా శాఖ వంటి కీలక శాఖలను పూర్తి సమర్థత గల కొత్త మంత్రులకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఈ మార్పుల ద్వారా పరిపాలనలో వేగం పెంచడం, కొత్త పథకాలైన ఇందిరమ్మ ఇంటి పథకం వంటి వాటిని సజావుగా అమలు చేయడం ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రాజకీయ చదరంగంలో ఎవరికి చోటు దక్కుతుంది.. ఎవరు తమ పదవులను కోల్పోతారు అనే అంశంపై రాష్ట్ర ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.