: వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 (Income Tax Act 2025) అమలులోకి రానుంది. ఈ కొత్త చట్టంలో కీలక మార్పులు జరిగాయి. అందుకు అనుగుణంగానే ట్యాక్స్ పేయర్లకు ఊరట లభించనుంది. కొత్త ఐటీ చట్టం అమలులోకి వస్తున్న క్రమంలో ట్యాక్స్ పేయర్లకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చీఫ్ రవి అగర్వాల్ శుభవార్త అందించారు. సోమవారం కీలక ప్రకటన చేశారు. కొత్త చట్టం కింద ఈసారి ఐటీఆర్ (ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్) ఫారాలను ముందుగానే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. గత 60 సంవత్సరాలుగా చెల్లుబాటులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త చట్టం అమలులోకి రానుంది. ఈ కొత్త ఐటీ చట్టానికి అనుగుణంగా ఐటీఆర్ ఫారాలు ఉండనున్నాయని తెలిపారు. ' కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టానికి సంబంధించి కొత్త ఫారాలు, నిబంధనల రూపకల్పన జరుగుతోంది. జనవరిలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో కొత్త ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ట్యాక్స్ పేయర్లకు తగిన సమయం దొరుకుతుంది' అని రవి అగర్వాల్ తెలిపారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో ట్యాక్స్ పేయర్లు లాంజ్ ఏర్పాటు సందర్భంగా మీడియాతో మాట్లాడారు. టీడీఎస్ త్రైమాసిక రిటర్న్స్ ఫారాలు, వంటివి ఇందులో ఉన్నాయి. ప్రస్తుత ఫామ్స్ వెనక్కి తీసుకుని సులభమైన ఫారాలను రూపొందించే అంశంపై పన్నుల బోర్డు పని చేస్తోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమలులోకి వస్తుంది. ఇందులో కొత్త పన్నులేవీ విధించలేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. క్లిష్టమైన పన్ను చట్టాన్ని సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా సరళీకరించిన భాషలో రూపొందించినట్లు వెల్లడించింది. పాత ఐటీ చట్టంలో 819 సెక్షన్లు ఉన్నాయి. వాటిని 536కు తగ్గించారు. 5.12 లక్షల పదాలను 2.6 లక్షల పదాలకు పరిమితం చేశారు.