Billionbrains Garage Shares: ఇటీవల స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన ఐపీఓల్లో గ్రో లిమిటెడ్ పేరెంట్ కంపెనీ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఇది మంచి ప్రీమియంతో లిస్టింగ్ కాకపోయినా.. తర్వాత దుమ్మురేపింది. .. బుధవారం సెషన్‌లో మాత్రం పడిపోయింది. ఏ దశలోనూ కిందటి ధరను దాటి వెళ్లలేకపోయింది. స్టాక్ మార్కెట్ సూచీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతుండగా.. ఇదే క్రమంలో వరుసగా పతనం అవుతూ వచ్చి.. 10 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టింది. దీంతో ఇన్వెస్టర్ల లాభాలు తగ్గడం లేదా కొత్తగా ఇన్వెస్ట్ చేసిన వారికి నష్టాలు వచ్చాయని చెప్పొచ్చు.మంగళవారం సెషన్‌లో రూ. 188.77 వద్ద ఈ షేరు ముగియగా.. ఇవాళ స్వల్ప నష్టంతో రూ. 187.99 వద్ద ఓపెన్ అయింది. చివరికి 10 శాతం నష్టంతో (లోయర్ సర్క్యూట్) రూ. 169.89 వద్ద స్థిర పడింది. ఇప్పుడు కూడా ఐపీఓ ధరతో పోలిస్తే 69.89 శాతం ఎక్కువే ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.05 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 193.80 కాగా.. కనిష్ట ధర రూ. 112 గా ఉంది. వరుసగా 5 సెషన్లు పుంజుకున్న క్రమంలో.. ఈ లాభాల్ని సొమ్ము చేసుకునేందుకు.. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగారు. దీంతో షేర్లలో విపరీతంగా అమ్మకాలు వెల్లువెత్తగా స్టాక్ లోయర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. ఐపీఓ రూపంలో వచ్చిన ఈ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌కు విపరీతమైన డిమాండ్ వచ్చిందని చెప్పొచ్చు. ఎన్నో రెట్ల మేర సబ్‌స్క్రిప్షన్ జరిగింది. అయితే.. ఆ మధ్య స్టాక్ మార్కెట్ ఒడుదొడుకుల్లో ఉండగా.. ప్రీమియం కాస్త తక్కువే వచ్చింది.ఇష్యూ ధర రూ. 100 గా ఉండగా.. NSE లో నవంబర్ 12న రూ. 112 వద్ద లిస్టింగ్ అయింది. ఇక్కడ ప్రీమియం 12 శాతంగానే ఉందని చెప్పొచ్చు. అయితే అక్కడితో ఆగలేదు. అదేరోజు స్టాక్ ధర మరో 10 శాతానికిపైగా పెరిగింది. ఇంకా వరుసగా పెరుగుతూ వచ్చింది. దీంతో 5 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో స్టాక్ ధర 93.80 శాతం పెరిగింది. దాదాపు షేర్ ధర డబుల్ అయిందని చెప్పొచ్చు. ఐపీఓ ద్వారా విజయవంతంగా షేర్లు వచ్చిన వారికి.. 5 రోజుల్లో డబుల్ రిటర్న్స్ అందగా.. ఇప్పుడు స్టాక్ ధర పడిపోవడంతో ఆ లాభం తగ్గిందని చెప్పొచ్చు.