రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు.. ఈ ప్రాంతాల్లో జోరుగా రహదారుల పనులు, 80 శాతం పూర్తి

Wait 5 sec.

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన తెలంగాణ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మొత్తం 148.5 కిలోమీటర్ల బీటీ పనులకు గాను రూ. 365 కోట్లు మంజూరు చేసింది. ఈ పనుల్లో ఇప్పటికే 80 శాతం పూర్తవగా.. మిగిలిన 20 శాతం పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు.కొడంగల్ మండలం రావల్‌పల్లి నుంచి దౌల్తాబాద్ వరకు ఉన్న 8 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసల రోడ్డుగా మార్చేందుకు రూ. 40 కోట్లు కేటాయించారు. ఈ పనులు ప్రస్తుతం చురుకుగా కొనసాగుతున్నాయి. దౌల్తాబాద్ మండలం కుదురుమల్ల నుంచి దోమ మండలం దాదాపూర్ వరకు 17 కిలోమీటర్ల రహదారిని రూ. 50 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే దుద్యాల మండలం హస్నాబాద్ నుంచి పెద్దనందిగామ మీదుగా దౌల్తాబాద్ మండలం నీటూర్ సరిహద్దులోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారికి కలిపే 10.3 కిలోమీటర్ల రోడ్డు పనులకు రూ. 26 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ పనులు కూడా దాదాపు 80 శాతం పూర్తయ్యాయి.హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఉన్న లింగన్‌పల్లి నుంచి దుద్యాల వరకు 11 కిలోమీటర్ల దూరం రూ. 28 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటితో పాటుగా జాతీయ రహదారి నుంచి అంగడిరైచూర్, అన్నారం, టేకుల్‌కోడ్ మీదుగా రుద్రారం వరకు రూ. 33 కోట్లతో డబుల్ రోడ్డు పనులు నడుస్తున్నాయి. పర్సాపూర్ నుంచి పాత కొడంగల్ వరకు 4 కిలోమీటర్ల రోడ్డు పనులను రూ. 11 కోట్లతో చేపడుతున్నారు. దౌల్తాబాద్ మండలం నందారం నుంచి గుండ్లకుంట జంక్షన్ వరకు, బొంరాస్‌పేట మండలం బాపల్లి నుంచి దోమ మండలం బడెంపల్లి వరకు 12.6 కిలోమీటర్ల దూరం కోసం రూ. 30 కోట్లతో పనులు జరుగుతున్నాయి.రూ. 10 కోట్లతో బొంరాస్‌పేట మండలంలో, నందారం వద్ద వంతెనల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధులు (SDF) ద్వారా వేసిన మట్టి రోడ్ల స్థానంలో ఊరకుంటతండా, సంగాయిపల్లి, పలుగురాళ్లతండా, జీడిగడ్డతండాలకు కొత్తగా బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు. మరోవైపు కొడంగల్ పురపాలికలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి శ్రీవారి ఆలయం వరకు 2 కిలోమీటర్ల దూరం కోసం అత్యధికంగా రూ. 60 కోట్లు కేటాయించినప్పటికీ.. ఈ పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కొడంగల్ ఆర్అండ్ఆర్ ఏఈ శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో పాత రోడ్లతో పాటు కొత్తగా మంజూరైన రహదారుల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.