లైంగిక సమస్యలకు రూ.48 లక్షలతో చికిత్స.. చెడిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిడ్నీ!

Wait 5 sec.

తన బాగుచేస్తానని ఓ ఆయుర్వేద షాపు యజమాని.. రూ. 48 లక్షలకు టోకరా వేశాడని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసుకు ఫిర్యాదు చేశాడు. అతడు ఇచ్చిన ఔషధాల వల్ల తన కిడ్నీ చెడిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.ఇదీ జరిగింది..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి 2023లో పెళ్లి అయింది. కొన్నాళ్ల తర్వాత అతడిలో లైంగిక సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కెంగేరిలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం ప్రారంభించారు. అయితే ఈ ఏడాది మే 3న వాహనంలో ప్రయాణిస్తుండగా.. సదరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు రోడ్డు పక్కన ఓ టెంట్ కనిపించింది. లైంగిక సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తామని ఆ టెంట్‌పై రాసి ఉంది. దీంతో టెకీ ఆత్రుతతో ఆ టెంట్‌లోకి వెళ్లాడు. అయితే అతడి సమస్యలను విజయ్ గురూజీ అనే వ్యక్తి నయం చేస్తాడని.. ఆ టెంట్‌లో ఉన్న ఓ వ్యక్తి చెప్పాడు. అనంతరం శ్రీ విజయలక్ష్మీ ఫార్మసీ యజమాని విజయ్ గురూజీ అనే వ్యక్తి.. టెకీని పరిశీలించాడు. అనంతరం దేవరాజ్ బూతి అనే ఆయుర్వేద ఔషధం వాడాలని సూచించాడు. అయితే అది కేవలం తన షాపులో మాత్రమే దొరుకుతుందని.. ఒక్క గ్రాము ధర రూ. 1.6 లక్షలు ఉంటుందని చెప్పాడు. ఆన్‌లైన్‌లో కాకుండా క్యాష్‌లో పేమెంట్ చేయాలని ఆ గురూజీ చెప్పాడు. అతడిని నమ్మిన బాధితుడు.. ఆ ఔషదాన్ని కొనుగోలు చేశాడు. ఇలా క్రమంగా భవన్ బూతి అనే మరో ఔషధాన్ని రూ. 76 వేలకు ఒక గ్రాము చొప్పున కొన్నాడు. అలా కొన్ని వారాల్లో రూ. 17 లక్షలు గురూజీకి ఇచ్చి.. వివిధ ఔషధాలు కొనుగోలు చేశాడు.ఇన్ని ఆయుర్వేద ఔషధాలు వాడినా బాధితుడిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో మరిన్ని దేవరాజ్ బూతి మందులు వాడాలని.. లేకుంటే ఇప్పటివరకు వాడిని ఔషధాలకు ఏ ప్రయోజనం ఉండదని బలవంతం చేశాడు. ఇక చేసేదేమీ లేక రూ. 20 లక్షలు లోన్ తీసుకున్న బాధితుడి.. 18 గ్రాముల ఆయుర్వేద మెడిసిన్ కొనుగోలు చేశాడు. ఇది చాలనట్టు దేవరాజ్ రసబూతి అనే ఔషధాన్ని రూ. 2.6 లక్షలకు ఒక గ్రాము చొప్పున కొన్నాడు. దీనికోసం ఓ స్నేహితుడి దగ్గర రూ. 10 లక్షలు అప్పు చేశాడు. ఇలా ఆయుర్వేదిక్ షాపు యజమానికి మొత్తం రూ. 48 లక్షలు ముట్టజెప్పాడు బాధితుడు. ఈ ఆయుర్వేదిక్ ఔషధాలు అన్ని వాడటం వల్ల బాధితుడి కిడ్నీ దెబ్బతింది. ఇదేంటని ఆ గురూజీని నిలదీయగా.. మధ్యలో చికిత్స ఆపేస్తే చనిపోయే ప్రమాదం ఉందని బెదిరించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.