దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. భారత్‌కు కష్టమేనా..కొంపముంచిన ముత్తుస్వామి.!

Wait 5 sec.

గువహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 489 పరుగులకు ఆలౌటైంది. 247/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన ప్రొటీస్‌.. ముత్తుస్వామి, మార్కో జాన్సెన్‌ రాణించడంతో భారీ స్కోరు చేసింది. ఏకంగా 151.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి.. 489 పరుగులు చేసింది. దీంతో టెస్ట్‌లో తిరుగులేని స్థితిలో నిలిచింది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు.సొంతగడ్డపై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన భారత్‌కు.. సౌతాఫ్రికా బ్యాటర్లు సవాల్ విసిరారు. రెండో రోజు మరో 50-100 పరుగుల లోపే ఆ జట్టును ఆలౌట్ చేయాలనే ప్లాన్‌తో టీమిండియా బౌలర్లు బరిలోకి దిగారు. కానీ దక్షిణాఫ్రికా బ్యాటర్లు మాత్రం గొప్పగా బ్యాటింగ్ చేశారు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సెనురాన్ ముత్తుస్వామి భారత బౌలర్లను విసిగించాడు. అసలైన టెస్ట్ ఆటతీరుతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు.ఏడో వికెట్‌కు వెర్రైన్‌తో కలిసి 236 బంతుల్లో 88 పరుగులు జోడించిన ముత్తుస్వామి.. ఆ తర్వాత జాన్సెన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 106 బంతుల్లోనే 97 పరుగులు జోడించి.. జట్టు స్కోరును 400 పరుగుల మార్కు దాటించాడు. మొత్తంగా 206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109 పరుగులు చేసి, ఔట్ అయ్యాడు. ఇక తొమ్మిదో స్థానంలో వచ్చిన మార్కో జాన్సెన్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. ఓ దశలో సెంచరీ చేసేలా కనిపించిన అతడు.. 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 పరుగులు చేసి.. చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ (49), టెంబా బవుమా (41), మార్‌క్రమ్ (38), రికెల్టన్ (35), వెరైన్ (45) రాణించారు. దీంతో దక్షిణాఫ్రికా 489 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ అత్యధితంగా 4 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా, మహమ్మద్‌ సిరాజ్, జస్‌ప్రీత్‌ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. ఇక రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాస్త ముందుగానే ముగించారు. ప్రస్తుతం భారత్ 6.1 ఓవర్లలో 9/0తో నిలిచింది. క్రీజులో కేఎల్ రాహుల్ (2), జైశ్వాల్ (7) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే వేగంగా పరుగులు చేయడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయాలి.