ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ప్రైవేట్ గదులు.. ఫీజు ఎంతంటే.. వారికి మాత్రమే!

Wait 5 sec.

ఈ రోజుల్లో నాణ్యమైన వైద్యం అనేది అందరికీ అందని ద్రాక్షగా మారుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక వసతుల కల్పన, మెరుగైన చికిత్స, ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రజలకు ముందు నుంచి ఉన్న అపోహాలు, అనుమానాలతో ఎక్కువ మంది ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు పెడుతుంటారు. చికిత్స తీసుకున్న అనంతరం.. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు వేసే బిల్లులు చూసి షాక్ తింటుంటారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల సంగతికి వస్తే ఓపీ సేవలకు ఓ రేటు, అడ్మిషన్లకు ఓ రేటు.. జనరల్ వార్డుకు ఓ రేటు.. స్పెషల్ రూమ్‌కు మరో రేటు.. ఇలా ఉంటుంది పరిస్థితి. కానీ ప్రభుత్వ ఆస్పత్రులలోనూ ప్రత్యేక గదుల గురించి ఎప్పుడైనా విన్నారా. ప్రభుత్వ ఆస్పత్రులు అనగానే.. జనరల్ వార్డులే గుర్తుకు వస్తుంటాయి. కానీ స్పెషల్ రూమ్‌లు కూడా ఉన్నాయని మీకు తెలుసా..విజయనగరంలోని ఘోష ఆసుపత్రిలో ప్రత్యేక గదుల సౌకర్యం ఉంది. ఉమ్మడి జిల్లావాసుల ఆరోగ్య ప్రదాయినిగా పేరుంది. ఈ ఆస్పత్రిలో రోగుల కోసం ప్రత్యేక గదుల సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే ఇది అందరికీ కాదండోయ్.. ఇక్కడ కూడా కండీషన్లు అప్లై. కొంతమందికి మాత్రమే ఈ పేమెంట్ గదులు ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. గర్భిణులు, బాలింతలకు మాత్రమే ఈ పేమెంట్ గదులు కేటాయిస్తారు. ఘోష ఆస్పత్రిలో నాలుగు పేమెంట్ గదులు ఉన్నాయి. ఒక్కో పేమెంట్ గదిలోనూ రెండు బెడ్స్ ఉంటాయి. ముందే చెప్పుకున్నట్లు ఈ పేమెంట్ గదుల కోసం కాస్త పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. పేమెంట్ గదిలో రెండు పడకలు ఉంటాయి. ఒక్కో బెడ్‌కు బెడ్ ఫీజును రోజుకు రూ.500లుగా నిర్ణయించారు. ఒకవేళ గదిలోని రెండు బెడ్లు కావాలని అనుకుంటే రోజుకు వేయి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో కండీషన్ కూడా ఉంది. ఈ పేమెంట్ గదుల కోసం ముందుగా అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ బెడ్ అయితే రూ.5000, రెండు పడకలూ అయితే రూ.10000 కట్టాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో ఎన్ని రోజులు ఉన్నారో లెక్కేసుకుని.. మనకు వచ్చేదేమైనా ఉంటే డిశ్చార్జి అయ్యాక వెనక్కి ఇస్తారు. మనమే కట్టాల్సి ఉంటే ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇక బాలింత, బిడ్డతో పాటుగా ఒక సహాయకురాలు ఉండేందుకు అనుమతి ఉంది. అలాగే గర్భిణి, ఆమె సహాయకురాలు ఉండేందుకు అనుమతిస్తారు. మగవారికి ఇక్కడికి అనుమతి ఉండదు. వారికోసం విజిటింగ్ అవర్స్ ఉంటాయి. అలాగే డాక్టర్లు ఇక్కడికే వచ్చి సేవలు అందిస్తారు. బాలింతలకు ఈ పేమెంట్ రూమ్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రసవం తర్వాత కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అలాంటి సమయంలో ఈ ప్రత్యేక గదులను ఉపయోగించుకుంటున్నారు.