గొప్ప మనసు చాటుకున్న తెలంగాణ పీసీసీ చీఫ్.. స్కూల్ నిర్మాణం కోసం 11 ఎకరాలు దానం..

Wait 5 sec.

నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలంలోని తన స్వగ్రామమైన రహత్‌నగర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనకున్న మమకారాన్ని, బాధ్యతను గొప్ప దాతృత్వంతో చాటుకున్నారు. గ్రామాభివృద్ధి, విద్య, విద్యుత్ సదుపాయాల మెరుగుదల కోసం ఆయన తన సొంత ఆస్థిలో 11 ఎకరాల భూమిని విరాళంగా ప్రకటించి.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన దాతృత్వాన్ని మెచ్చిన గ్రామస్తులు, భారీ గజమాలలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ దాతృత్వంలో 11 ఎకరాలను రెండు ముఖ్య అవసరాల కోసం కేటాయించారు. వీటిలో.. రహత్‌నగర్ ప్రాంతంలో విద్యా సదుపాయాలు మెరుగుపడాలనే లక్ష్యంతో.. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి 10 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. ఈ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యతో పాటు, ఆధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు.దీంతో పాటు.. గ్రామంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ఉద్దేశించిన సబ్‌స్టేషన్ విస్తరణకు ఆయన తన సొంత భూమిలో నుంచి ఒక ఎకరాన్ని దానం చేశారు. ఈ సబ్‌స్టేషన్ ద్వారా గ్రామం అభివృద్ధి చెందుతుందని.. పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం భూమి దానం మాత్రమే కాకుండా.. రాష్ట్ర పర్యాటక రంగంలో కీలకమైన ధర్మపురి నుంచి బాసర వరకు ప్రతిపాదించిన టెంపుల్ కారిడార్ రోడ్డు రహత్‌నగర్ గ్రామం మీదుగా వచ్చేలా తాను చేసిన కృషికి ఫలితం దక్కిందని మహేష్ కుమార్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. రూ.380 కోట్ల వ్యయంతో నిర్మించబోయే ఈ రోడ్డు పూర్తయితే.. ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబద్రిగుట్ట, బాసర వంటి పుణ్యక్షేత్రాలు ఒకే కారిడార్‌లో కలుస్తాయి.ఈ చారిత్రక రహదారి నిర్మాణంలో తన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నందుకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో కరీంనగర్, నిజామాబాద్ మధ్య రహత్‌నగర్ సెంటర్ పాయింట్ అవుతుందని.. ఇది ప్రాంతీయ పర్యాటకానికి, గ్రామాభివృద్ధికి గొప్ప ఊపునిస్తుందని స్పష్టం చేశారు. గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న దుర్గాదేవి ఆలయ భూమి పూజలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి బొమ్మ గంగాధర్ గౌడ్ గతంలో ఆలయ నిర్మాణానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సంప్రదాయం, ఆధ్యాత్మికత, గ్రామాభివృద్ధి ఈ మూడు విలువలు తన కుటుంబానికి పునాదిగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఎన్నడూ ఊహించలేదని.. కానీ గ్రామంతో తనకున్న అనుబంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుందని.. గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు.