గ్రేటర్ తిరుపతి కల సాకారం దిశగా తొలి అడుగు పడింది. ప్రస్తుతం తిరుపతి నగరం పరిధి 30.17 చ.కి.మీ. ఉంది.. అయితే దీనిని 300 చ.కి.మీ.లకు విస్తరించనున్నారు. ఈ ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గత నెల 24న 53 గ్రామ పంచాయతీలను విలీనం చేయడానికి కౌన్సిల్ అంగీకరించగా.. తాజాగా మరో పది గ్రామ పంచాయతీలను కూడా కలపడానికి ఆమోదం తెలిపారు. నగర మేయర్ డా.శిరీష అధ్యక్షతన జరిగిన ఈ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో, కమిషనర్ ఎన్‌.మౌర్య ఈ విలీన ప్రతిపాదనను సమర్పించారు. కార్పొరేటర్లు అందరూ దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందడంతో గ్రేటర్ తిరుపతి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని మరిన్ని గ్రామాలను తిరుపతి నగరంలో విలీనం చేయనున్నారు.కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సూచన మేరకు, పట్టణానికి దగ్గరగా ఉన్న, ప్రజల కోరిక మేరకు, భౌగోళికంగా, పట్టణ లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు చేశారు. కొత్తగా చేరిన పంచాయతీలలో.. 'తిరుపతి రూరల్‌ మండలంలోని పెరుమాళ్లపల్లి, పుదిపట్ల, కుంట్రపాకం, గాంధీపురం, బ్రాహ్మణపట్టు.. చంద్రగిరి మండలంలోని బుచ్చినాయుడుపల్లె, పిచ్చినాయిడుపల్లె, రాయలపురం.. రేణిగుంట మండలంలోని అత్తూరు.. ఆర్సీపురం మండలంలోని సి.రామాపురం'లు ఉన్నాయి. తిరుపతిని కేంద్రంగా చేసుకుని కల్యాణిడ్యాం, రాయలచెరువు, అంజారమ్మకణం, ఏర్పేడు ఐఐటీ, ఐజర్‌ వరకు గ్రేటర్‌ను విస్తరిస్తే భవిష్యత్ తరాలకు ఎంతో మేలు జరుగుతుంది అన్నారు మేయర్ శిరీష. ఎంపీ గురుమూర్తి తిరుమలను కూడా గ్రేటర్‌ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఈ గ్రేటర్‌ ఏర్పాటుపై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, అందుకే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. మేయర్‌ ప్రతిపాదనలను ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పాలనా సౌలభ్యం, మౌలిక వసతుల కల్పన, ఆదాయ వృద్ధి, పట్టణ స్వరూపాన్ని మెరుగుపరచడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు కమిషనరు మౌర్య. మొదట్లో 10 లక్షల జనాభాతో పరిశీలించినా, అనుకూల అంశాలు తక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్‌ ఏర్పాటు క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ అన్నారు.లో కలవడానికి రూరల్ మండలంలోని చాలా గ్రామ పంచాయతీలు ఒప్పుకోలేదు. 34 పంచాయతీల్లో 32 పంచాయతీలు గ్రేటర్‌లో కలవడానికి వీల్లేదని తీర్మానించాయి. కేవలం సాయినగర్, న్యూమంగళం (శెట్టిపల్లె) పంచాయతీలు మాత్రమే కలవడానికి అంగీకరించాయి. గ్రేటర్‌లో విలీనంపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి డీపీవో నోటీసులు జారీ చేశారు. 34 పంచాయతీలు తమ తీర్మానాలను పంపాలని ఆదేశించారు. ఈ నోటీసులు అందిన పది రోజుల్లోగా తీర్మానాలు సమర్పించాల్సి ఉంది. అయితే, చాలా పంచాయతీలు గ్రేటర్‌లో కలవడానికి నిరాకరించాయి.