ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఎయిర్‌‌పోర్టుల నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. కొత్తగా మొత్తం ఏడు విమానాశ్రయాలకు ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చింది. అయితే ప్రకాశం జిల్లా ఒంగోలు విమానాశ్రయం ఏర్పాటు దిశగా మరో కీలక ముందడుగు పడింది.విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పనిని ఒక ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థ చేపట్టింది. ఈ సంస్థకు చెందిన సిబ్బంది, విమానాశ్రయం నిర్మించాలనుకుంటున్న ప్రాంతంలో సర్వే చేస్తున్నారు. ఈ సర్వే పూర్తయి, డీపీఆర్‌ సిద్ధం అయితే ఆ తర్వాత టెండర్లు, పనులు దిశగా అడుగులు పడతాయంటున్నారు. ఒంగోలు నగరానికి సమీపంలో ఉన్న కొత్తపట్నం మండలంలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర బృందం సానుకూలత వ్యక్తం చేసింది. జనవరిలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌‌తో కలిసి భూమిని పరిశీలించారు. అయితే ప్రతిపాదించిన రన్‌వేలో కొన్ని మార్పులు చేస్తే విమానాశ్రయం నిర్మించడం సులభమవుతుందని బృందం సూచించింది. ఈ సానుకూల స్పందనతో, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) రెండు నెలల క్రితం డీపీఆర్‌ తయారీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోసం డీపీఆర్‌ (వివరాల ప్రాజెక్ట్ నివేదిక) రూపకల్పన పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు రంగంలోకి దిగారు. వీరు కొత్తపట్నం చేరుకుని జీపీఎస్‌ ఆధారిత సర్వే కూడా నిర్వహించారు. ఇటీవల మొంథా తుపాను కారణంగా విమానాశ్రయం కోసం ప్రతిపాదించిన భూముల్లో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వరద నీరు లేని ప్రాంతాల్లో సర్వే పూర్తి చేశారు.. మిగతా సర్వేను త్వరలోనే చేపట్టనున్నారు. త్వరలోనే ఈ సంస్థ విమానాశ్రయం ఏర్పాటుపై నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగానే విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలుంటాయి. ఒంగోలు విమానాశ్రయం ఏర్పాటుకు మొత్తం 1,100 ఎకరాల భూమి కావాలని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే వాన్‌పిక్‌ సంస్థకు చెందిన 551 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మిగిలిన భూమిని కొత్తపట్నం మండలంలోని అల్లూరు, ఆలూరు, కొప్పొలు, పాదర్తి గ్రామాల్లో సేకరించాలని నిర్ణయించారు. ఈ గ్రామాల్లో ఎంత ప్రభుత్వ భూమి ఉంది, ఎంత ప్రైవేటు (పట్టా) భూమి ఉంది అనే వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించారు. ఈ భూసేకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి, అధికారులు డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదిక పూర్తయిన తర్వాత, ప్రభుత్వం భూసేకరణ కోసం అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. ఏయే గ్రామాల్లో ఎంత భూమి అవసరమో ఇప్పటికే గుర్తించారు కాబట్టి, రైతులకు చెల్లించాల్సిన పరిహారం ఎంత అనేది లెక్క తేల్చితే భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. భూమి అందుబాటులోకి రాగానే విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.