పైరసీ కింగ్‌పిన్ iBomma రవి నెల సంపాదన ఎంతో తెలుసా..? విస్మయానికి గురిచేసే నిజాలు..!

Wait 5 sec.

సినిమా పైరసీతో పెను సంచలనం సృష్టించిన 'ఐబొమ్మ' (iBomma) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా ప్రపంచానికి తన గుర్తింపు తెలియకుండా.. చేసి కోట్లాది రూపాయల దండుకొని.. పైరసీ దందాను దర్జాగా నడిపించిన ఇతడి సాంకేతిక నైపుణ్యం, నేర ప్రవృత్తి పోలీసులనే విస్మయానికి గురిచేశాయి. 'ఏమీ లేనివాణ్ని.. ఎవ్వరితోనూ సంబంధాల్లేవు. బంధాలు, బంధుత్వాలకు దూరంగా ఉన్నా. చావుకు భయపడని వాడు దేనికీ భయపడడు' అంటూ పోలీసులకు సవాల్ విసిరిన పైరసీ కింగ్‌పిన్ ప్రయాణం కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా సాగింది. రిమాండ్ రిపోర్టు, దర్యాప్తులో వెల్లడైన కీలక అంశాల ప్రకారం.. విశాఖకు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి చిన్న అప్పారావు కుమారుడైన ఇమంది రవి ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె ఉన్నత కుటుంబానికి చెందినది కావటంతో రవిని సూటిపోటి మాటలతో వేధించేవారు. దీంతో డబబబు సంపాదనే లక్ష్యంగా అక్రమ మార్గంలో అడుగులు వేశాడు రవి. కూకట్‌పల్లిలో నివాసం ఉన్న రవి మొదట్లో నెలకొల్పిన ఐటీ కంపెనీ ద్వారా నెలకు రూ. 1 లక్ష వరకు ఆదాయం వచ్చేది. కానీ, పైరసీ సినిమాల ద్వారా వచ్చే ఆదాయం నెలకు రూ. 11 లక్షలు దాటడంతో ఐటీ కంపెనీని మూసివేశాడు.ఐబొమ్మ వెబ్‌సైట్‌లో బెట్టింగ్ యాప్స్‌ నుంచి భారీగా ప్రకటనలు తెచ్చుకొని, ఆరేళ్లలో కోట్లాది రూపాయలు కూడబెట్టాడు. దేశ, విదేశాల్లో ఆస్తులు కొన్నాడు. తన అసలు గుర్తింపు తెలియకుండా ఉండేందుకు ప్రహ్లాద్ కుమార్ పేరుతో పాన్ కార్డు సంపాదించాడు. దీని ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిచి, క్రిప్టో, బిట్‌కాయిన్ రూపంలో ఆన్‌లైన్‌లో విదేశాల నుంచి లావాదేవీలు నిర్వహించాడు. భారత పౌరసత్వం రద్దు చేసుకొని ఏకంగా రూ. 80 లక్షలు చెల్లించి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పౌరసత్వం తీసుకున్నాడు. నేరాల నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే ఈ విదేశీ పౌరసత్వం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఒకే ప్రాంతంలో ఉంటే పట్టుబడే అవకాశం ఉందనే భయంతో రవి తరచూ దేశాలు మారుతుండేవాడు. యూరప్ దేశాలంటే ఇష్టపడే అతడు.. దాదాపు 2 నెలలకో దేశం చుట్టొచ్చేవాడు. ఇప్పటివరకు అతడి పాస్‌పోర్ట్ ఆధారంగా 10 నుంచి 11 దేశాలకు వెళ్లొచ్చినట్లు గుర్తించారు. ఆయా దేశాల్లో బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించాడు. ఐబొమ్మపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుసుకొని రవి సెప్టెంబర్ 3న విదేశాలకు పారిపోయాడు. ఫ్రాన్స్‌లో 2 నెలలు గడిపి, ఈ నెల 14న కూకట్‌పల్లిలోని తన సొంతింటికి చేరుకున్నాడు. అదే రోజు రవి కదలికలపై నిఘా ఉంచిన సైబర్ క్రైమ్ పోలీసులు నివాసానికి చేరుకున్నారు. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేసినా.. అదే రోజు ఇంట్లో సామాగ్రితో రవి కరేబియన్ దీవులకు పారిపోయేవాడని పోలీసులు తెలిపారు. అతడికి సంబంధించిన 35 బ్యాంకు ఖాతాల్లో లభించిన ఆధారాల ప్రకారం.. రవి రూ. 20 కోట్లు సంపాదించినట్లు పోలీసులు అంచనా వేశారు. అందులో 4 ఖాతాల్లోని రూ. 3.5 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. మరోవైపు, ఐబొమ్మ ద్వారా రవి సాగించిన అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్‌ వివరాలు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కోరగా.. కేసు కొత్త మలుపు తిరిగింది.