శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు వేద మంత్రాలు చదువుతుండగా, వేలాది మంది భక్తులు "సాయి నామస్మరణ" చేశారు. మంగళవారం ఉదయం వేద పఠనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్య ఘట్టం వెండి రథోత్సవం. ఈ రథం 31.8 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిపై 9.2 కిలోల బంగారంతో చేసిన సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని ఉంచారు. రథం తయారీకి 180 కిలోల వెండిని, బంగారు పూత కోసం కిలో బంగారాన్ని ఉపయోగించారు. అనంతరం, ప్రపంచ శాంతి కోసం మహాసమాధి వద్ద 1,100 జంటలు కలిసి సత్యనారాయణ వ్రతం చేశారు. సాయికుల్వంత్‌ మందిరం నుంచి సత్యసాయి, వేణుగోపాలస్వామి, సీతారామ, హనుమాన్‌ ఉత్సవ విగ్రహాలను సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్, వేద పండితులు భక్తితో బయటకు తీసుకువచ్చారు. వాటికి ప్రత్యేక పూజలు చేశారు.ఇంతకుముందు ప్రతి సంవత్సరం వేణుగోపాలస్వామి రథోత్సవం మాత్రమే నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది నుంచి కొత్తగా సత్యసాయి రథోత్సవాన్ని కూడా ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు సత్యసాయి దర్శనం చేసుకుని ఎంతో ఆనందించారు. ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచాయి. ఈ రథోత్సవంలో ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. అంతేకాదు మంగళవారం రాత్రి సత్యసాయి బాబా తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. పుట్టపర్తిలో సత్యసాయి బాబా జీవితం, బోధనలు, ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ రూ.100 నాణెం, నాలుగు తపాలా బిళ్లలను ఆవిష్కరించి, ప్రపంచ మహిళా దినోత్సవంలో ప్రసంగిస్తారు. అనంతరం కోయంబత్తూరులో జరిగే సేంద్రియ వ్యవసాయ సదస్సులో పాల్గొంటారు. ఉదయం 9.45 గంటలకు ప్రధాని మోదీ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయానికి వెళ్లి, సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పిస్తారు. అనంతరం 10.30 గంటలకు హిల్‌వ్యూ స్టేడియంలో జరిగే ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాని మోదీ హిల్‌వ్యూ స్టేడియం నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు వెళ్లి.. అక్కడ దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సులో పాల్గొంటారు. మరోవైపు సత్యసాయి శత జయంత్యుత్సవాలకు హాజరయ్యేందుకు పలువురు ప్రముఖలు పుట్టపర్తికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్, సినీనటి ఐశ్వర్యరాయ్‌ ఇప్పటికే పుట్టపర్తి వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బుధవారం పుట్టపర్తికి వచ్చారు. పుట్టపర్తిలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.