ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో సరుకుల్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలోని రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేసి.. రేషన్‌ను షాపుల్లోనే పంపిణీ చేస్తున్నారు. అయితే రేషన్ డీలర్లు ప్రభుత్వానికి కొన్ని రిక్వెస్ట్‌లు చేశారు. రేషన్ డీలర్లకు క్వింటాల్‌కు రూ.200 కమీషన్, రూ.7,500 గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర రేషన్ డీలర్ల సమావేశంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు కొన్ని కీలక విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లకు 2018 తర్వాత కమీషన్ పెంచలేదని గుర్తు చేశారు లీలా మాధవరావు. రాష్ట్రవ్యాప్తంగా 65 ఏళ్లు పైబడిన వారికి ఇంటింటికీ రేషన్ అందించే ప్రక్రియలో డీలర్ల ఖర్చులు పెరుగుతున్నాయని ఆయన వివరించారు. వాహనాలతో రేషన్ పంపిణీ చేసేటప్పుడు సహాయకుడికి రూ.5వేలు ఇచ్చేవారని.. ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని కోరారు. అలాగే ఈఎస్‌ఐ సౌకర్యం, మరణానంతరం రూ.15 వేలు మట్టి ఖర్చుల కింద ఇవ్వాలని కూడా కోరారు. ఈ విషయాలను త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పరిస్థితిని అర్థం చేసుకుని సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌లో అక్రమాలు అరికట్టేందుకు, పారదర్శకత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల్ని తీసుకొచ్చింది. గత రెండు నెలలుగా ఈ కార్డుల్ని లబ్ధిదారులకు అందజేస్తున్నారు. అలాగే రేషన్ డీలర్ల కూడా కొత్త ఈపోస్ మెషిన్లు అందజేశారు. స్మార్ట్ కార్డుల్ని తీసుకురావడంతో అందుకు తగిన విధంగా కొత్త మెషిన్లు తీసుకొచ్చారు. గంటల కొద్ది క్యూ లైన్లలో నిలబడాల్సిన పనిలేకుండా.. వేగంగా రేషన్ పంపిణీ చేయొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ఈ కొత్త ఈపోస్ యంత్రాలతో రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది లబ్ధిదారులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్ని తీసుకోలేదు.. వారంతా ఈ నెలాఖరు లోపు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేని పక్షంలో ఆ రేషన్ కార్డుల్ని వెనక్కు పంపిస్తామంటున్నారు.