HYD: బీటెక్ పూర్తి చేసిన వారికి బంపరాఫర్.. ఆరు నెలల ట్రైనింగ్.. రూ.6 లక్షల జీతంతో ఉద్యోగం..!

Wait 5 sec.

ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థినులకు మల్టీ నేషనల్ కంపెనీల్లో, ప్రముఖ పరిశ్రమల్లో వెంటనే ఉద్యోగాలు లభించేలా అధికారులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్యాంపస్‌లో చదివి ప్రతిభావంతులైన విద్యార్థినులకు నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఈ ఏడాది 40 మందికి ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన 40 మంది విద్యార్థినులను ఈ అవకాశానికి ఎంపిక చేశారు.ఎంపికైన వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ 'ఎమర్టెక్స్' తో జేఎన్‌టీయూ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ శిక్షణ ద్వారా విద్య, పరిశ్రమల అనుసంధానం చేస్తూ డీప్‌టెక్ డొమైన్లలో విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ఆరు నెలల శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత.. ఒక్కొక్కరికి కనీసం రూ. 4.5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వార్షిక వేతనం లభించేలా అధికారులు కార్యచరణను రూపొందించారు. ట్రైనింగ్ ఇవ్వటంతో పాటుగా.. ఉద్యోగాలు కూడా కల్పించనున్నారు. జేఎన్‌టీయూ క్యాంపస్‌తో పాటుగా.. దాని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివిన పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థినులను కూడా అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. వారు వృత్తిపరంగా ఉద్యోగ జీవితంలో స్థిరపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా క్యాంపస్ ఇంటర్వ్యూలలో కొద్దిపాటి తేడాతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. బెంగుళూరు కేంద్రంగా గత 22 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎమర్టెక్స్, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో భాగస్వామిగా ఉంది. పరిశ్రమ ఆధారిత శిక్షణను అందించి, ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా ఈ సంస్థ సహకరిస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణలో పేద విద్యార్థినులకు ఉజ్వల భవిష్యత్తు లభించనుంది. విద్యార్థినులు ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్యాంపస్ అధికారులు సూచించారు.