పేదరికం ఎంత దారుణంగా ఉంటుందో, మనిషిని ఎలాంటి నిస్సహాయ స్థితిలోకి నెడుతుందో తెలియజేసే మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. కడుపు నిండా తిండి లేక అనారోగ్యానికి గురై దివ్యాంగుడైన కుమారుడు మరణించగా.. ఆ బిడ్డ అంత్యక్రియలకు సైతం చిల్లిగవ్వ లేని తండ్రి కొడుకు మృతదేహాన్ని భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. బాలరాజు అనే వ్యక్తి స్థానికంగా ఒక పత్తి మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఏడాది కిందట మిల్లు మూతపడటంతో బాలరాజు ఉపాధి కోల్పోయాడు. దీంతో వారి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. తరచూ భార్యతో గొడవలు జరిగేవి. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరీశ్ (8) పుట్టుకతోనే అవయవ లోపం, మానసిక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగుడు. భర్తకు సంపాదన లేకపోవడంతో భార్య చిన్న కుమారుడిని తీసుకొని ఆరు నెలల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాలరాజు.. దివ్యాంగుడైన పెద్ద కుమారుడి ఆలనాపాలనా చూసుకుంటూ ఒక హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.సరిగా తిండి దొరకకపోవడం, పచ్చ కామెర్లతోతానూ అనారోగ్యానికి గురికావడంతో బాలరాజు తన కుమారుడికి సరైన వైద్యం, ఆహారం అందించలేకపోయాడు. నాలుగు రోజులుగా కేవలం నీరు తాగి మాత్రమే బతుకుతున్నామని బాలరాజు వాపోయాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం హరీశ్ తీవ్ర అనారోగ్యంతో మృతిచెందాడు. తన చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో.. కుమారుడి మృతదేహాన్ని భుజాన వేసుకొని ప్రేమ్‌నగర్ శ్మశానవాటికకు వెళ్లాడు. అంత్యక్రియలు పూర్తి చేయడానికి డబ్బు లేక మధ్యాహ్నం 2 గంటల నుంచి హరీశ్ మృతదేహాన్ని తన ఒడిలో పెట్టుకొని రోధిస్తూ సాయం కోసం ఐదు గంటలపాటు ఎదురుచూశాడు.బాలరాజు పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే జడ్చర్లకు చెందిన వీఆర్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సమాచారం అందించారు. సంస్థ ప్రతినిధి ప్రవీణ్, వాలంటీర్లతో కలిసి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో శ్మశానవాటికకు చేరుకున్నారు. వారు పొక్లెయిన్‌తో గుంత తీయించి హరీశ్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి, కొడుకు ఆకలి బాధ, నిస్సహాయత కళ్లారా చూసిన స్థానికులు, వాలంటీర్లు చలించిపోయారు. కనీసం అంత్యక్రియలకు కూడా డబ్బు లేని స్థితిలో ఒక తండ్రి పడిన ఆవేదన ఆ ప్రాంతంలో విషాద వాతావరణాన్ని నింపింది.