తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఏపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ సామాజిక వర్గాన్ని ఓసీల్లో చేర్చి అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శెట్టి బలిజ సామాజికి వర్గానికి చెందిన కొందరు బంధువులు హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి హయాంలో శెట్టి బలిజల్ని ఓసీల్లో చేర్చారన్నారు. ఈ క్రమంలో శెట్టి బలిజలు ఓసీలలో కలవడం వల్ల వారి జీవితాలు నాశనం అయ్యాయన్నారు. ఈ నిర్ణయంతో భావితరాల వారి భవిష్యత్ పాడైపోతాయన్నారు. ఏపీ మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో శెట్టి బలిజలు బీసీ కేటగిరిలో ఉన్నారు.. అయితే తెలంగాణలో మాత్రం ఓసీల్లో కలిపారు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి కూడా శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.ఏపీలో కూడా రెండు నెలల క్రితం శెట్టిబలిజ బీసీ కులాన్ని ఓసీల్లో చేరుస్తున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ ఇచ్చారు. శెట్టిబలిజలను ఓసీల్లో చేరుస్తున్నారనేది వైఎస్సార్‌సీపీ నేతల అబద్ధపు ప్రచారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారం ద్వారా కులాల మధ్య గొడవలు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. గీత వృత్తి చేసుకునే వారి గురించి మాట్లాడే అర్హత వైఎస్సార్‌సీపీ నేతలకు లేదన్నారు మంత్రి సుభాష్. కూటమి ప్రభుత్వం గీత వృత్తిదారులకు అండగా నిలుస్తుందని, వారికి మద్యం షాపుల్లో ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తోందని తెలిపారు. మద్యం షాపుల్లో, బార్లలో 10% వారికి కేటాయించినట్లు మంత్రి వివరించారు. వైఎస్సార్‌సీపీ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని, ఈ తప్పుడు ప్రచారంతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాజాగా తెలంగాణలో శెట్టిబలిజల్ని ఓసీల్లో చేర్చడంపై మంత్రి స్పందించారు.. మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. దీంతో మరోసారి శెట్టి బలిజల అంశం తెరపైకి వచ్చింది.