సొంతూరు అంటే ఎవరికి మమకారం ఉండదు! పైచదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ సిటీల్లో, దేశవిదేశాల్లో ఉండే వారందరికి.. వీలు దొరికితే మళ్లీ ఓసారి పుట్టి పెరిగిన ఊరికి వెళ్లాలని ఉంటుది. అందులో కొందరు తమ ఆనందాన్ని ఊళ్లో వాళ్లతో పంచుకోవాలని అనుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి కూడా ఇలాగే చేశాడు. వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డా.. తన జీవితంలోని ముఖ్య ఘట్టాన్ని తాను పుట్టి పెరిగిన గ్రామంలోని వాళ్లతో పంచుకోవాలనుకున్నాడు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి.. వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఇటీవల బహ్రెయిన్ దేశంలో తన కూమార్తె వివాహం చేశాడు. అయితే తన సంతోషాన్ని తాను పుట్టి పెరిగిన ఊరి వాళ్లతో పంచుకోవాలనుకున్నాడు. అందులో భాగంగా తన స్వగ్రామం బద్దిపడగలో.. గ్రామస్తులందరికీ విందు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా నూతన వధూవరుల చేతుల మీదుగా.. ఊళ్లో ఉన్న దాదాపు 1,300 మంది మహిళలకు పట్టు. దీనిపై స్పందించిన ప్రశాంత్ రెడ్డి.. తాను పుట్టి పెరిగిన ఊరికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. పెద్దల నుంచి వచ్చిన ఆచారంలో భాగంగా.. గ్రామ దేవతలను కొలిచానని చెప్పారు. అనంతరం తనకు తోచినంతగా ఊరి ప్రజలకు సహాయం చేసినట్లు తెలిపాడు. సొంతూరి ప్రజల పాట్లు చూడలేక..గతంలో సొంతూరులో నెలకొన్న సమస్యలను ఓ ఎన్నారై పరిష్కరించాడు. గ్రామంలో అధ్వాన స్థితిలో ఉన్న రోడ్డు, ప్రయాణికుల పాట్లు చూసి అతడి మనసు చలించింది. రంగారెడ్డి డిల్లా కేశంపేట మండల కేంద్రం నుంచి లే మామిడికి వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతుండడంతో.. లే మామిడి గ్రామానికి చెందిన ఎన్నారై గోగు వెంకట్ నారాయణరెడ్డి ముందుకొచ్చారు. అనంతరం రోడ్డుపై గుంతలను మట్టితో పూడ్చి వేయించి తాత్కాలిక మరమ్మతులు చేయించారు. సొంతూరు కోసం తన వంతు బాధ్యతను నిర్వహించానని.. ఇకముందు కూడా గ్రామం అభివృద్ధి కోసం పాటుపడతానని నారాయణరెడ్డి తెలిపారు. నారాయణ రెడ్డిని తన సొంతూరు ప్రజలతో పాటు.. ఆ మార్గంలో రాకపోకలు సాగించే గ్రామాల వారు అభినందించారు. కొత్త రోడ్డు వేయించలేకపోయినా.. ఇలా ఉడతా భక్తిగా సహాయం చేశాడు. అయితే సహాయం చేయలన్న మనసు అందరికీ ఉండదు.