ఇక 1600 సిరీస్ నుంచే ఫోన్ చేయాలి.. కేంద్రం డెడ్‌లైన్.. బ్యాంకులు సహా ఆ సంస్థలు మారాల్సిందే

Wait 5 sec.

TRAI: బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, పెట్టుబడులు, ఇన్సూరెన్స్ వంటి రంగాలకు చెందిన కంపెనీల నుంచి తమ కస్టమర్లకు వివిధ అవసరాల కోసం ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అందించే సేవలు, ఇస్తున్న సౌకర్యాల వంటి వాటిని తెలియజేసేందుకు ఫోన్ చేస్తుంటారు. అయితే, ఇలా ఆయా కంపెనీల పేరుతో సైబర్ నేరగాళ్లు సైతం ఫేక్ కాల్స్ చేస్తూ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది. అలాంటి ఫేక్ కాల్స్‌కి చెక్ పెట్టేందుకు సంస్థ ట్రాయ్ కీలక ముందడుగు వేసింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, బీమా కంపెనీల వంటి వాటికి 1600 వాడకంపై గడువు నిర్దేశించింది ట్రాయ్. ఆ గడువు నుంచి తమ కస్టమర్లకు సేవలందించే అంశంపై చేసే కాల్స్ 1600 సిరీస్ నంబర్‌నే తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ట్రాయ్ బుధవారం ఓ ప్రకటన చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని బ్యాంకులు సహా అన్ని కమర్షియల్ బ్యాంకులు వచ్చే ఏడాది 2026 జనవరి 1లోగా 1600 సిరీస్‌కు మారిపోవాలని నిర్దేశించింది. క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లు అయితే 2026, మార్చి 15 నాటికి ఈ సిరీస్‌ను అందిపుచ్చుకోవాలని స్పష్టం చేసింది. సెబీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీ స్వచ్ఛందంగా ఈ 1600 సిరీస్‌కు మారాలని తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీలు, కో ఆపరేటివ్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, చిన్న కంపెనీలకు అయితే 2026, మార్చి 1 గడువు నిర్దేశించింది. సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు, పెన్షన్ ఫండ్ మేనేజర్లకు అయితే ఫిబ్రవరి 15 నాటికి ఈ 1600 సిరీస్‌కు మారాలని తెలిపింది. ఇన్సూరెన్స్ సెక్టార్‌కు అయితే గడువు పై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు ట్రాయ్ వివరించింది. పెరుగుతున్న ఆర్థిక నేరాలను అరికట్టేందుకు తీసుకొచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారులను సంప్రదించేందుకు ఈ 1600 సిరీస్ ఉపయోగించడం వల్ల అధీకృత కంపెనీల నుంచే ఫోన్ వచ్చినట్లు గుర్తించడం సాధ్యమవుతుందని ట్రాయ్ చెబుతోంది. ఇందులో భాగంగానే బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా రంగాలకు ఈ 1600 సిరీస్ కేటాయించింది టెలికాం విభాగం డాట్. దీని ద్వారా కస్టమర్లు ఆర్థిక మోసాల బారినపడే అవకాశాలు తగ్గుతాయని పేర్కొంది. ఇప్పటికే 485 సంస్థలు 2800 పైగా నంబర్లను రిజిస్టర్ చేసుకున్నట్లు వెల్లడించింది.