తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు పంపిణీ చేసే బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. ను కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. తాజాగా దీనిపై కదలిక వచ్చింది. ఈసారి పంపిణీ విధానంలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. గతంలో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోగా.. ఈ సంవత్సరం మాత్రం డ్వాక్రా మహిళలకే ప్రాధాన్యత ఇవ్వనుంది. సోమవారం నాడు తాండూర్ మండల పరిషత్ కార్యాలయానికి బతుకమ్మ చీరలు భారీగా చేరుకున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని 33 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న సుమారు 25 వేల మంది మహిళలు, యువతులకు ఈ చీరలను అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 19న స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా సన్నాహాలు చేస్తున్నారు. గతంలో.. రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేవారు. కానీ.. ఈ విధానం కారణంగా నిజమైన పేద మహిళలకు.. ఉపాధి కోసం కష్టపడే మహిళలకు తగినంత లబ్ధి చేకూరడం లేదనే విమర్శలు వచ్చాయి. ఈ సంవత్సరం, చీరల పంపిణీకి రేషన్ కార్డు ఉన్నా.. లేకున్నా సరే, డ్వాక్రా గ్రూపులో సభ్యత్వం (Dwcra Group Membership) ఉండటం తప్పనిసరి చేశారు. డ్వాక్రా గ్రూపులో సభ్యత్వం ఉన్న మహిళలు, వారు ఆత్మగౌరవంతో.. స్వయం ఉపాధితో బతకడానికి ప్రయత్నిస్తున్నందున.. వారికే ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడంతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు డ్వాక్రా గ్రూపుల ద్వారానే మరింత సమర్థవంతంగా అందించడానికి ఒక మార్గం సుగమమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా మహిళల అభిరుచికి తగ్గట్టుగా వివిధ రంగులు, డిజైన్లలో చీరలను అధికారులు సిద్ధం చేశారు. పండుగకు ముందే చీరల పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు వేగంగా పనిచేస్తున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో సభ్యత్వం లేని మహిళలకు మాత్రం ఈ చీరల పంపిణీ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం స్త్రీ శక్తిని గౌరవిస్తూ, మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందిరా మహిళా శక్తి పేరుతో ఈ చీరలను పంపిణీ చేస్తున్నారు.