ఇప్పటివరకు మన దేశంలో రైల్వేలను ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంటుంది. దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్న భారతీయ రైల్వేలకు సంబంధించి.. అన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. అయితే భారతీయ రైల్వే చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖిస్తూ.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల దేశంలోనే మొదటి ప్రైవేట్‌గా నిర్వహిస్తున్న స్టేషన్‌గా నిలిచింది. ఈ స్టేషన్ రైలు ప్రయాణికులకు అందించే సౌకర్యాలు విదేశీ ఎయిర్‌పోర్టుల్లో అందించే లగ్జరీ సౌకర్యాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాయి.ఈ రాణీ కమలాపతి రైల్వే స్టేషన్‌ను మొట్టమొదట 2017 జూన్‌లో హబీబ్‌గంజ్ స్టేషన్‌గా ప్రారంభించారు. గోండ్ రాణి గౌరవార్థం ఈ స్టేషన్‌కు రాణీ కమలాపతి రైల్వే స్టేషన్ అనే పేరును 2021 నవంబర్‌లో పెట్టారు. ఇక ఈ రాణీ కమలాపతి రైల్వే స్టేషన్‌ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో పనిచేస్తుంది. ఇక ఈ రైల్వే స్టేషన్‌కు యజమాని అయినప్పటికీ.. ఆ స్టేషన్ నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలను మాత్రం బన్సల్ గ్రూప్ అనే ఒక ప్రైవేటు కంపెనీ పర్యవేక్షిస్తుంది.ఈ రాణీ కమలాపతి రైల్వే స్టేషన్‌ లోపలికి అడుగు పెట్టగానే.. సాంప్రదాయ భారతీయ రైల్వే స్టేషన్ల సందడి కనిపించకుండా.. ఎయిర్‌పోర్ట్ తరహాలో సౌకర్యాలు స్వాగతం పలుకుతాయి. రైలు ప్రయాణానికి ముందు ప్రయాణికుల విశ్రాంతి కోసం విశాలమైన, ఎయిర్ కండిషన్డ్ కన్‌కోర్స్‌లు.. వెయిటింగ్ లాంజ్‌లు ఉంటాయి. ప్లాట్‌ఫారమ్‌ల మధ్య సులభంగా రాకపోకలు సాగించడానికి హై స్పీడ్ ఎస్కలేటర్లు, లిఫ్టులు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ రైల్వే స్టేషన్‌లో అత్యాధునిక ఫుడ్ కోర్టులు, రిటైల్ అవుట్‌లెట్లు, ఒక హోటల్, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, ఆఫీస్ స్పేస్‌లు కూడా స్టేషన్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేశారు. సోలార్ ఎనర్జీతో నడిచే మౌలిక సదుపాయాలు, 24 గంటల పాటు విద్యుత్, అధునాతన సీసీటీవీ సెక్యూరిటీ వ్యవస్థలు ఈ రాణీ కమలాపతి రైల్వే స్టేషన్‌లో ఉన్నాయి. ఈ న్యూఢిల్లీ–చెన్నై ప్రధాన మార్గంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్.. భోపాల్ రైల్వే డివిజన్‌కు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి దేశంలోనే ప్రముఖ రైళ్లకు ఇది ముఖ్యమైన రైల్వే స్టేషన్‌గా కొనసాగుతోంది.రాణీ కమలాపతి స్టేషన్ కేవలం ఒక రైల్వే స్టేషన్ మాత్రమే కాకుండా.. ఇది ఆధునిక భారతీయ రైలు ప్రయాణానికి ఒక నమూనాగా భావిస్తున్నారు. ఈ మొట్టమొదటి ప్రైవేటు రైల్వే స్టేషన్ సక్సెస్ అయిన తర్వాత.. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై సీఎస్‌టీ వంటి ఇతర ప్రధాన స్టేషన్లలో కూడా ఇదే తరహా అప్‌గ్రేడ్‌లను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ రైల్వే స్టేషన్ అందిస్తున్న సౌకర్యాలు, సామర్థ్యం కారణంగా.. ప్రయాణికులకు ఇక్కడ అడుగడుకునా వీఐపీ అనుభూతిని కలుగుతుంది.