ఆంధ్రప్రదేశ్‌లో సామాన్యులకు అందుబాటు ధరల్లో కందిపప్పు, బియ్యం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బహిరంగ మార్కెట్లో ఈ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో, కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలులో ముందుగా ఒక విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మరో రెండు కేంద్రాలను తెరవనున్నారు. కొన్ని రోజుల క్రితం, జాయింట్ కలెక్టర్ (జేసీ) ఆర్. గోపాలకృష్ణ నిత్యావసర ధరల నియంత్రణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బహిరంగ మార్కెట్లో బియ్యం, కందిపప్పు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, సామాన్య ప్రజలు వాటిని కొనలేకపోతున్నారని గుర్తించారు.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, జేసీ పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని మూడు రైతు బజార్లలో వెంటనే విక్రయాలు ప్రారంభించాలని సూచించారు. ఈ చర్యల ద్వారా, బియ్యం తక్కువ ధరలకే లభించేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒంగోలు లాయర్‌పేటలోని రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాలను జేసీ ఆర్ గోపాలకృష్ణ ప్రారంభించారు. బహిరంగ మార్కెట్ ధరల కంటే తక్కువకే ఈ నిత్యావసరాలను అందించేందుకు పౌరసరఫరాల శాఖ ఈ ఏర్పాటు చేసింది. దిబ్బలరోడ్డు, కొత్తపట్నం బస్టాండు వద్ద ఉన్న రైతు బజార్లలో ఆదివారం ఈ కేంద్రాలను ప్రారంభించారు.కిలో కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ.110 నుంచి రూ.120 వరకు ఉంది.. రైతుబజార్లలో కిలో రూ.100కే లభిస్తుంది. అలాగే బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.52 నుంచి రూ.60 వరకు ఉన్నాయి. రైతుబజార్లలో ఒక రకం కిలో రూ.48కు, మరో రకం కిలో రూ.49కు అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాదు కందిపప్పు అవసరమైతే ఒక్కొక్కరికి రెండు కిలోల వరకు కూడా ఇస్తారు. బహిరంగ మార్కెట్లో 25 కిలోల బియ్యం ధర రూ.1,400కు పైగా ఉండగా, రైతుబజార్లలో రూ.1,225కే విక్రయిస్తున్నారు. ఈ చౌక ధరల విక్రయాల వల్ల సామాన్యులకు కొంత ఊరట లభించనుంది. మొత్తం మీద తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు అందిస్తున్నారు.