ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. ఈ నెల 19న కింద రెండో విడత నిధులన్ని విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అదే రోజు కేంద్రం కూడా పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేయనుంది. కేంద్రం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు ప్రతి రైతు బ్యాంక్ అకౌంట్‌లలో జమ అవుతాయి. ఈ అన్నదాత సుఖీభవ రెండో విడత ద్వారా మొత్తం 46 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో కొందరు రైతులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, సాంకేతిక లోపాల వల్ల వారి ఖాతాల్లో డబ్బు జమ కావడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం రైతులకు మరో అవకాశం కల్పిస్తోంది. రైతులు తమ సమస్యలను సరిచేసుకుని, అవసరమైన పత్రాలను సమర్పిస్తే, వారికి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. రైతు ఆధార్ నంబర్ వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా నమోదు అయితే, వెంటనే రెవెన్యూ అధికారులను సంప్రదించి సరిచేయించుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు 'ఈ పథకానికి అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. ఎన్‌పీసీఏలో ఇన్ యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలి' అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఒకవేళ రైతు పేరు పథకం జాబితాలో లేకపోతే, వ్యవసాయ కేంద్రాల్లోని సహాయకులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో వేలాది మంది రైతులు సాంకేతిక సమస్యల కారణంగా ఈ పథకం ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఈకేవైసీ పూర్తి కాకపోవడం, బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడం, కొందరి బ్యాంకు ఖాతాలు నిలిచిపోవడం వంటి కారణాలు ఈ సమస్యలకు దారితీశాయి. ఈ సమస్యల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.గతంలోఅమలులో అనేక సమస్యలు తలెత్తాయి. భూ యజమానులు చనిపోతే వారిని జాబితాల నుంచి తొలగిస్తున్నారు. దీంతో వారసులకు పాసుపుస్తకాలు అందడంలో ఆలస్యం జరుగుతోంది. వెబ్‌ల్యాండ్‌లో పట్టా నంబరు లేని ఖాతాలను కూడా తిరస్కరించారు. సాగు భూమికి ఆధార్‌ అనుసంధానంలో తప్పులు దొర్లాయి. ఈ సమస్యలు ఇంకా తహసీల్దార్ల స్థాయిలో పరిష్కారం కాలేదు. నెలకు రూ.20 వేలకు పైగా జీతం పొందే ఉద్యోగులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు. ఆక్వా సాగు, వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదు. 10 సెంట్లలోపు భూమి ఉన్నవారు, భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకానికి అనర్హులు. ఈ-కేవైసీ పూర్తి చేసుకోని వారికి పథకం ప్రయోజనాలు అందడం లేదు. ఈ అడ్డంకులన్నీ రైతు భరోసా పథకం లబ్ధిదారులకు చేరడంలో జాప్యానికి కారణమవుతున్నాయి.ఏపీ ప్రభుత్వం 'పీఎం కిసాన్‌- అన్నదాత సుఖీభవ' పథకాన్ని అమలు చేస్తోంది.ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు మూడు విడతల్లో జమ అవుతాయి. కేంద్రం ఇచ్చే రూ.6 వేల రూపాయలతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.14 వేలు అందిస్తుంది. కేంద్రం ఇచ్చే 'పీఎం కిసాన్‌' పథకం ద్వారా ప్రతి ఏటా ఇచ్చే రూ.6వేలను మూడు విడతల్లో.. ప్రతి విడతలో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు మూడు విడతల్లో ఇస్తారు.. మొదటి రెండు విడతల్లో ఒక్కో విడతకు రూ.5 వేల చొప్పున.. అంటే మొత్తం రూ.10 వేలు ఇస్తారు. ఇక మూడో విడతలో మిగిలిన రూ.4 వేల అందజేస్తారు.