బిగ్ షాక్.. తెలంగాణ గ్రూప్ 2 సెలక్షన్ లిస్ట్ రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు..

Wait 5 sec.

దాదాపు పదేళ్ల క్రితం నిర్వహించిన తెలంగాణ గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై తెలంగాణ హైకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. 2015-16లో విడుదలైన ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీజీపీఎస్సీ (TGPSC) కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే ఈ తీర్పుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఓఎంఆర్ షీట్లలో వైట్‌నర్ వినియోగం..ఈ మొత్తం వ్యవహారం ఓఎంఆర్ (OMR) షీట్లలో వైట్‌నర్ వాడకం చుట్టూ తిరిగింది. నోటిఫికేషన్ ప్రకారం వైట్‌నర్‌ను వాడటం స్పష్టంగా తప్పు అయినప్పటికీ.. పరీక్ష రాసిన కొందరు అభ్యర్థులు తమ క్యాండిడేట్ వివరాలను నమోదు చేసేటప్పుడు వైట్‌నర్ వాడారు. 2016 నిర్వహించిన ఈ గ్రూప్ 2 పరీక్షలో ఈ అభ్యర్థులు చేసిన తప్పును పొరపాటుగా భావించి.. కేవలం కాండిడేట్ వివరాల విభాగంలో మాత్రమే వైట్‌నర్ వాడిన వారిని అంగీకరిస్తామని టీజీపీఎస్సీ ఒక వెబ్‌నోట్‌ విడుదల చేసింది. టీజీపీఎస్సీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. మరికొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. నోటిఫికేషన్ నిబంధనలనుఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించవద్దని అప్పుడు హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది.కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ.. టీజీపీఎస్సీ ఆ ఆదేశాలను ఉల్లంఘించి వైట్‌నర్ వాడిన అభ్యర్థులను కూడా సెలక్షన్ లిస్ట్‌లో చేర్చిందని తాజా విచారణలో ధర్మాసనం గుర్తించినట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి.. తమ పరిధి దాటి వ్యవహరించినందుకు టీజీపీఎస్సీపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీజీపీఎస్సీ 2019లో ఇచ్చిన మొత్తం ఎంపిక జాబితాను హైకోర్టు తక్షణమే రద్దు చేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. పరీక్షలో పారదర్శకతను పునరుద్ధరించడానికి.. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడానికి హైకోర్టు టీజీపీఎస్సీకి మార్గదర్శకాలను. డెడ్‌లైన్‌ను విధించింది.వైట్‌నర్ వాడిన అభ్యర్థులను తొలగించి వారికి సంబంధించిన మార్కులను లెక్కించకుండా.. మిగిలిన అర్హుల ఓఎంఆర్ షీట్లను మరోసారి పునఃమూల్యాంకనం చేయాలని ఆదేశించింది. ఈ పునఃమూల్యాంకనం ఆధారంగా రూపొందించిన నూతన సెలక్షన్ లిస్ట్‌ను ఎనిమిది వారాల్లో పూర్తి చేసి ప్రకటించాలని టీజీపీఎస్సీకి కఠినమైన గడువు విధించింది. ఈ సంచలన తీర్పు, ప్రభుత్వ నియామకాల్లో న్యాయ వ్యవస్థ ప్రాధాన్యతను, పారదర్శకత ఆవశ్యకతను మరోసారి స్పష్టం చేసింది.