హైదరాబాద్ నగర పరిధిలోని ఆఫీసులో నెలల వ్యవధిలోనే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్‌లు సస్పెండ్ కావడం తీవ్ర దుమారం రేపుతోంది. కొన్ని రోజుల క్రితమే.. రాజేష్ అనే సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కడంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఈ క్రమంలోనే ఆ స్థానంలో సీనియర్ అసిస్టెంట్ శివశంకర్‌కు ఇంఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించారు. అయితే తాజాగా ఆయన అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో.. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. దీంతో ఆ వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏం జరుగుతోందని.. వరుసగా ఎందుకు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ అవుతున్నారు అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వనస్థలిపురం ఇంఛార్జ్ సబ్ రిజిస్ట్రార్‌‌గా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శివశంకర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో శివశంకర్‌‌ అవినీతికి పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఓ పార్కు స్థలానికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో.. శివశంకర్‌పై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వేటు వేసింది. కొన్ని నెలల క్రితమే ఆ స్థానంలో పనిచేసిన రాజేష్ అనే సబ్ రిజిస్ట్రార్ అవినీతి నిరోధక శాఖకు చిక్కడంతో అతడిని సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే అదే ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివశంకర్‌‌కు సబ్ రిజిస్ట్రార్ ఇంఛార్జి‌గా తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. హయత్‌నగర్ మండలం సాహె‌బ్‌నగర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని 200 సర్వే నంబరులో వివాదానికి కారణమైన ఓ పార్కు స్థలం వ్యవహారానికి సంబంధించి శివశంకర్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి.సాహెబ్ నగర్ ప్రాంతంలో గతంలో ఉన్న లే అవుట్(అనధికారిక) ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అక్కడ ఉండే స్థానికులు.. పలు కోర్టులను ఆశ్రయించి అనుమతులు తీసుకుని తమ భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న పార్కు ప్రాంతానికి కూడా బై నంబర్‌తో కొంతమంది రిజిస్ట్రేషన్‌ కోసం అప్లై చేయగా.. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్ పూర్తి చేశారు. ఈ వ్యవహారంపై.. స్థానికులు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే వివిధ పత్రాలకు ఒకే ప్రాంతం ఫొటోలు చూపించినా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. అందులో పార్కు స్థలం కూడా ఉన్నట్లు ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు చూపించారు. ఈ విషయంలో సబ్‌రిజిస్ట్రార్ శివశంకర్‌ చాలా ఉదాసీనంగా వ్యవహరించినట్లు తేలింది. దీంతో శివశంకర్‌పై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అధికారుల విచారణలో వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్‌ శివశంకర్‌‌‌ తప్పు ఉందని గుర్తించడంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి నిరోధక శాఖ దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. కార్యాలయాల్లో ఉన్న లోపాలపై ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖలో తెలంగాణ సర్కార్ కీలక సంస్కరణలు తీసుకువస్తున్నప్పటికీ.. సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మారకపోవడంపై ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.